113 రోజులు కరోనాతో పోరాడి కోలుకున్న వృద్ధుడు
అహ్మదాబాద్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. అయితే ఒక వృద్ధుడు కరోనాతో సుమారు నాలుగు నెలలపాటు పోరాడారు. చివరకు ఆ మహమ్మారి నుంచి కోలుకున్నారు. శుక్రవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గుజరాత్‌కు చెందిన 59 ఏండ్ల రవీంద్ర పర్మార్‌కు ఆగస్టు 26న కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. తొలుత అహ్మదాబాద్ ధోల్కాలోని ఒక ప్రైవేట్ దవాఖానకు అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆగస్టు 28న ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సోలా దవాఖానకు తరలించారు. సుమారు మూడు నెలలపాటు ఐసీయూలోనే ఉన్నారు. ఆయన ఊపిరి తిత్తులు బాగా దెబ్బతినడంతో ఒక్కోసారి నిమిషానికి 75 లీటర్ల ప్రాణవాయువును అందించారు. ఆ తర్వాత రవీంద్ర ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. దీంతో 113 రోజుల చికిత్స అనంతరం శుక్రవారం ఆయనను దవాఖాన నుంచి డిశ్చార్జ్ చేశారు.