దరఖాస్తులను 24 గంటల్లో పరిష్కరించాలి

అధికారుల స‌మీక్ష స‌మావేశంలో ఆర్డీవో సింధు

మండపేట (CLiC2NEWS) : స్పందన ద్వారా ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను 24 గంటల్లో పరిష్కరించాలని రామచంద్రపురం ఆర్డీవో సింధూ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. సచివాలయాల పరిధిలో ఎలాంటి పనులూ పెండింగ్ లో ఉండకూడదని సచివాలయాల్లో ప్రజల సమస్యలు 24 గంటల్లో పరిష్కరించి పంపాలని ఇందులో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన సబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేస్తానని ఆమె హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో మండలంలోని అన్ని శాఖల అధికారులతో ఆర్డీవో సింధూ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బుధవారం ఆమె వివిధ శాఖల అధికారులలో జరిపిన సమీక్షలో అధికారుల నుండి సమస్యలు తెలుసుకున్నారు. తొలుత ఎలక్ట్రిసిటీ బిల్లులపై చర్చ జరిగింది. మండలంలోని విద్యుత్ వినియోగ దారులు కరెంట్ బిల్లులు సచివాలయాల ద్వారా చెల్లింపులు జరుపుతుంటే ఆ బిల్లులు ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ కు అనుసంధానం కావడం లేదని సచివాలయం ఉద్యోగి ఆర్డీవో సింధూ దృష్టిలో పెట్టారు. దీనికి మండల విద్యుత్ శాఖ ఏఈని ఆమె ప్రశ్నించగా ఇంతవరకూ మా దృష్టికి సచివాలయ ఉద్యోగులు తేలేదని ఎక్కడ జాప్యం జరిగిందో తెలుసుకుంటానని ఎలక్ట్రికల్ ఏఈ సమాధానం చెప్పారు. సమస్య పరిష్కరించి తనకు తెలియజేయాలని ఆమె సూచించారు.

మండలంలో పలు అభివృద్ధి పనుల తీరుపై ఆమె ఆరా తీశారు. సచివాలయం భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, బల్క్ మిల్క్ సెంటర్, వైఎస్సార్ క్లినిక్ భవన నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై పంచాయితీ రాజ్ ఏఈ నాగేశ్వరరావు గ్రామాల్లో నిర్మించే ఆయా ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కాంట్రాక్టర్ లు ముందుకు రావడం లేదని చెప్పగా ఎందుకు రావడం లేదని ఆర్డీవో ప్రశ్నించారు. చేసిన పనులకు బిల్లులు సకాలంలో రాక పనులు చేపట్టడానికి ఆయా కాంట్రాక్టర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పనులు వేగవంతం చేయడానికి గ్రామాల్లో పక్షోత్సవాలు నిర్వహించి చైతన్య పరిచామని అన్నారు.

కొన్ని గ్రామాల్లో సర్పంచ్ సహకారం కొరవడిందని ఆయన వివరించారు. ఇందులో వెలగతోడు, అర్తమూరు గ్రామాల సర్పంచ్ లు తమకు సహకరించట్లేదని ఆర్డీవోకు వివరించారు. గతంలో ఆ రెండు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాలకు కూడా వారు హాజరు కాలేదని చెప్పారు. దీనిపై ఆర్డీవో ఏదిఏమైనా పనులను వేగవంతం చేయడానికి అధికారులు ప్రణాళిక వేసుకుని సాధించిన ప్రగతిని తనకు సమాచారం ఇవ్వాలని కోరారు. తానుకూడా పై అధికారులకు సమాధానం చెప్పాలన్నారు. వీటి నిర్మాణానికి ప్రధానంగా ఇసుక కొరత ఏర్పడిందని పంచాయితీ రాజ్ ఏఈ చెప్పగా అదేంటి ఇసుక మనమే కదా ఉచితంగా అందజేసేదని ఆర్డీవో స్పష్టం చేయగా స్టాక్ యార్డ్ ల నుండి ర్యాంప్ నిర్వాహకులు ఇసుక నిలుపుదల చేశారని గత రెండు నెలలుగా ఈ సమస్య నెలకొని ఉందన్నారు.

డంపింగ్ యార్డుల వద్ద ఇసుక దొడ్డి దారిన ఎక్కువగా వెళ్తుందే తప్ప ఉచిత ఇసుక కూపన్లకు ఇసుక సరఫరా ఇవ్వడం లేదని ఆర్డీవో కు ఇసుక సమస్యను వివరించారు. తాను ఉన్నతాధికారులతో మాట్లాడి ఇసుకను వెంటనే విడుదల చేయిస్తానని అన్నారు. ఉన్న రైతు భరోసా భవనాలను జనాభా ప్రాతిపదికన కాకుండా భూ విస్తీర్ణాన్ని బట్టి అంచనా వేసి భవనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వ్యవసాయ అధికారి బలుసు రవి సూచన చేశారు. ఇందులో కొన్ని రైతు భరోసా కేంద్రాలు అవసరం లేదని పంట భూములు ఎక్కువగా ఉన్న గ్రామాలకు ప్రాధాన్యత కల్పిస్తే ఉపయుక్తంగా ఉంటుందని ఏవో చెప్పగా ఆర్డీవో పరిగణలోకి తీసుకున్నారు.

మండల వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వరకూ వచ్చిందని ఎంపీడీవో ఐదం రాజుని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఇంకెంత మందికి వ్యాక్సిన్ వేయాలో గుర్తించి మిగిలిన వారికి కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఎంపీడీవో రాజుకు సూచించారు. సమావేశంలో తహసీల్దార్ టీ రాజరాజేశ్వరరావు, ఆర్ ఐ గౌరీ, డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ ఏఈ శ్రీనివాస్, మున్సిపల్ మేనేజర్ నిర్మలా కుమారి, టీపీఎస్ కట్టా వీరబ్రహ్మం, హౌసింగ్ ఏఈ గనేశ్వరరావు ఇతర శాఖల మండల అధికారులు, వీఆర్వోలు, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.