గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్
హైదరాబాద్ (CLiC2NEWS): గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎంపికయ్యారు. ఇవాళ(ఆదివారం) సమావేశమైన భారతీయ జనతాపార్టీ శాసనసభాపక్షం ఈ మేరకు భూపేంద్ర పటేల్‌ను గుజరాత్ సిఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. బీజేపీ హైకమాండ్ పటేల్ సామాజిక వర్గంవైపు మొగ్గుచూపింది. ఇవాళ గాంధీనగర్‌లో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా భూపేంద్ర పటేల్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. భూపేంద్ర పటేల్ పేరును మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు.
కేంద్ర పరిశీలకుడు నరేంద్రసింగ్ తోమర్ భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.
గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని భూపేంద్ర పటేల్ కోరనున్నారు. ప్రస్తుతం ఆయన ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అయితే, విజయ్ రూపానీ రాజీనామా చేసినప్పటి నుంచి కొత్త ముఖ్యమంత్రి రేసులో వినిపించిన కేంద్రమంత్రి మన్సుక్ మాండవీయ, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, గుజరాత్ డిప్యూటీ సిఎం నితిన్ పటేల్, సీనియర్ నేత పరుషోత్తమ్ రూపాలా పేర్లను ఈ సమావేశంలో పరిగణలోకే తీసుకోలేదు.