వెనకబడిన బడిన వర్గాలను గుర్తించిన ఏకైక నాయకుడు సిఎం జగన్
రాష్ట్ర అతిరస కార్పొరేషన్ చైర్మన్ యిళ్ళ భాస్కరరావు..

మండపేట (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన వర్గాలను గుర్తించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర అతిరస కార్పొరేషన్ చైర్మన్ యిళ్ళ భాస్కరరావు అన్నారు.. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆయన మండపేట విచ్చేశారు. ఏడిద రోడ్డులో ఉన్న ఎల్లారమ్మ దేవస్థానం ఆవరణలో ఉభయ గోదావరి జిల్లాల ఆసాధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లేగా వెంకన్న ఆధ్వర్యంలో సభను ఏర్పాటుచేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అతిరస కార్పొరేషన్ చైర్మన్ భాస్కరరావు మాట్లాడుతూ వెనకబడిన వర్గాలను గుర్తించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో 139 వెనుకబడిన కులాలు ఉన్నాయన్నారు. వెనుకబడి ఉన్న కులాలకు న్యాయం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా 56 కార్పొరేషన్ లు ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాలను ఓట్ల కోసం వాడుకున్నారే తప్ప ఎవరికీ న్యాయం చేకూర్చిన దాఖలాలు లేవన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తే అదే బాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనించడం విశేషమన్నారు.
56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశం హయాంలో చంద్రబాబు తన చెప్పుచేతల్లో ఉండే కులాలకే న్యాయం చేకూర్చారని వ్యాఖ్యానించారు. ఆర్థికంగా వెనకబడిన తరగతులను ఏ నాడు ఎదగనివ్వకుండా చేసి వారిని మరింత వెనక్కి నెట్టేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో ఉన్న 50 శాతం బీసీలను వెనుకబడిన వారిగా చూడలేదని జగన్ తన బ్యాక్ బోన్ గా పరిగణించి బీసీలకు తగిన గుర్తింపు తెచ్చారని ఉద్ఘాటించారు.
రాష్ట్రంలో అతిముఖ్యమైన 18 వెనుకబడ్డ కులాలు ఉన్నాయని వారి కోసం అతిరస కార్పొరేషన్ ఏర్పాటు చేసి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని వివరించారు. ఇందులో భాగంగా అతిరస కార్పొరేషన్ లో ఉండే 18 కులాల స్థితిగతులను, వారు పడుతున్న ఇబ్బందులను పరిశీలించి వారిని అభివృద్ధి పరచడానికి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జగన్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించడానికి శ్రీకారంచుట్టామన్నారు. అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా మండపేట ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది అన్నారు. నెల 18న సజ్జల రామకృష్ణారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, జంగా కృష్ణమూర్తిల సమక్షంలో 18 కులాల యొక్క స్థితిగతులు జీవన విధానం వారి ఎదుగుదలకు సంబంధించిన విషయాలను పరిశీలించి జగన్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
కార్పొరేషన్ లో ఉన్న కులాల అన్నింటిపై చర్చలు జరిగాయని వారికి నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అతిరస కార్పొరేషన్ లో ఉన్న ఆసాదుల కులస్తులు జీవన పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయన్నారు. మండపేటలో నివసిస్తున్న వారి ఇళ్లకు నేటి వరకు పట్టాలు లేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. పట్టణంలో ఉన్న ఎల్లారమ్మ దేవస్థానం భూమిలో లో ఆ సాధువులు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారని వారికి పట్టాలు ఇప్పించి ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించడానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న ఆసాదులు ఓ బీసీలుగా గుర్తించాలని తనను కోరారని ఈ విషయంపై శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు , రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ లతో మాట్లాడి వారి వినతిని పరిష్కరిస్తానని స్పష్ట పరిచారు.
గ్రామ దేవతల పూజారులుగా ఆసాదులు కులవృత్తి వృత్తి చేసుకుంటూ బ్రతుకుతున్నారన్నారు. వారికి కూడా పెన్షన్ లు ఇప్పించడానికి ప్రభుత్వంతో మాట్లాడి పెన్షన్లను ఇప్పిస్తానని అన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్రకార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ మాట్లాడుతూ మండపేట పట్టణంలో ఆసాదులు సంఖ్య ఎక్కువగా ఉందని వారి సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ఆసాదులను బీసీల జాబితాలో చేర్చారని అతిరస కార్పొరేషన్లో మండపేట నుండి ఒక డైరెక్టర్ పోస్టును ఇవ్వాలని ఆసాదులు కోరిన డిమాండ్ సబబే నంటూ కార్పొరేషన్ చైర్మన్ కు తెలిపారు.
మండపేట ఆసాదుల సంఘం నాయకులు వినతిపత్రాన్ని చైర్మన్ భాస్కరరావుకు సమర్పించారు. కార్పొరేషన్ చైర్మన్ ను ఆసాదులు ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పోతంశెట్టి వరప్రసాద్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మీగడ శ్రీనివాస్, శెట్టిబలిజ సంఘం పట్టణ అధ్యక్షుడు పెంకే గంగాధర్, ఎస్సీ నాయకుడు కొవ్వాడ అప్పన్న బాబు, ఆసాదుల సంఘం నాయకులు వేమవరపు రాంబాబు, పిల్లి సుబ్బారావు, పోయిన రాజు, లేగా సాయి కుమార్, వి అనిల్, ఎస్ డి బషీర్ సంఘ పెద్దలు పాల్గొన్నారు