కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం : కేంద్రం ప్రతిపాదన

న్యూఢిల్లీ (CLiC2NEWS): కరోనా వైరస్ తో మరణించిన కుటుంబాలకు రూ. 50 వేల పరిహారాన్ని అందించాలంటూ జాతీయ విపత్తు నిర్వహణ ఫ్రాధికారక సంస్థ సిఫార్సు చేసినట్లు కేంద్ర సర్కార్ వెల్లడించింది. కరోనా రోగులకు సేవలు అందిస్తూ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందజేయనున్నట్లు తెలిపింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
కొవిడ్ కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) నుంచి అందిస్తారు. ఇలాంటి మరణాలను కొవిడ్-19 కారణంగా చనిపోయినట్లు ధ్రువీకరించినందున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం కరోనా బాధితుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం అందించేలా కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ న్యాయవాదులు రీపక్ కన్సల్, గౌరవ్ కుమార్ బన్సాల్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిని విచారించిన సుప్రీం కోర్టు బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందో భాగంగా కరోనా మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి దేశవ్యాప్తంగా ఏకీకృత విధానానికి సంబంధించి మార్గదర్శాకాలు రూపొందించాలని జాతీయ విపత్తు నిర్వహణ ఫ్రాధికారక సంస్థ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే పరిహారం ఎంత ఇవ్వాలనే దానిపై తాము ఆదేశాలు ఇవ్వలేమని.. కేంద్ర ప్రభుత్వమే కనీస మొత్తాన్ని నిర్ధారించాలని సూచించింది. తొలుత ఇందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో పరిహారం ఇచ్చేందుకు మార్గదర్శకాలను రూపొందించిన కేంద్రం.. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తాయని పేర్కొంది.