మీరు గోళ్లు కొరుకుతున్నారా?

ప్రపంచంలో మిలియన్ల ప్రజలు గోళ్లు కొరకడం సమస్యతో బాధపడుతున్నారు. ఇది సాధారణంగా చిన్నతనంలోనే అలవాటై, పెద్దయ్యాక కూడా వదిలిపెట్టడంలేదు. ఎపుడూ గోళ్లు కొరకుతూ ఉండేవారి చేతులు మిగిలిన వారి కంటే భిన్నంగా ఉంటాయి. ఇలా గోళ్లు కొరికే వారికి షేక్‌హ్యాండ్ ఇవ్వాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఈ అలవాటును 20 సంవత్సరాలలోపు మానుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఈ అలవాటు వయసుతో పాటు పెరుగుతూనే ఉంటుంది. ఇది చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశం.

గోళ్లు ఎందుకు కొరుకుతారు…?

ఈ అలవాటు ఆ మనిషి ఎదుర్కొంటున్న అసంతృప్తికి యటకు కనిపించే ఓ చర్య మాత్రమే. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా తాను కోరుకున్న స్థాయిల్లో జీవించలేకపోవటం, కోరుకున్నది పొందలేకపోవటం కూడా కారణం కావొచ్చు. ఒక్కొక్కసారి సామర్థ్యలోపాలు కూడా కారణమవుతూ ఉంటాయి. బాధ్యతలు నిర్వహించుటలో ఎదురయ్యే ఒత్తిడి కూడా ఈ చర్యకు దోహదం చేయవచ్చు. కొన్ని సందర్భాలలో జరగబోయే విషయాలు, సంఘటనల పట్ల ఉండే ఉత్సుకత కూడా గోళ్లు కొరకడానికి ప్రేరేపించవచ్చు.

గోళ్లు కొరికితే నష్టం ఏమిటి ?

గోళ్లు కొరకడం వల్ల ఒత్తిడి పెరిగి మానసికస్థయిర్యం దెబ్బతింటుంది. ఈ అలవాటు వల్ల చేతుల నుంచి రక్తం కారడమే కాకుండా, చేతులను దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు కడుపునొప్పి, ఫుడ్‌పాయిజనింగ్, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలనూ కొనితెస్తుంది. నోట్లో కూడా చిగుర్ల నుంచి రక్తం కారడం, బ్రష్ వేసుకునేటపుడు నొప్పి కలగడం వంటి సమస్యలూ వస్తాయి. గోళ్లు కొరకడం వల్ల మీ చేతులు అందవిహీనంగా తయారవుతాయి. స్వీయ నియంత్రణ, ఓపిక ఉన్నట్లయితే ఈ అలావాటుకు మీరు వీడ్కోలు చెప్పవచ్చు.

ఈ అలవాటు మానుకోవాలంటే .. ?

మీ చేతిలో ఎపుడూ ఏదో వస్తువును కానీ, లేదా మిఠాయి వంటి పదార్థాలను పెట్టుకోండి. మీ గోళ్లు కొరకాలనపించినపుడు మిఠాయిని తినండి.

మీ గోళ్లకు రంగులు వేసుకోండి. మార్కెట్లో మగవారి కోసం కూడా ప్రత్యేకంగా తయారుచేసిన నెయిల్‌పాలిషెస్ అందుబాటులోకి వచ్చాయి. వీటికి రంగు ఉండదు. ఇవికాకుండా గోళ్లు అందంగా కనిపించడానికి రంగులు వేసుకున్నా మీకు వాటిని కొరకాలనిపించదు.

మీ గోళ్లను అందంగా, ఆకర్శనీయంగా కత్తిరించుకోండి. సాధారణంగా అమ్మాయిలకు అందంగా ఉన్న గోళ్లను కొరికి అందవిహీనంగా చేసుకోవడం ఇష్టం ఉండదు.

చాలామంది టీవీ చూస్తున్నపుడుగానీ, ఒంటరిగా ఏ పనీ లేకుండా కూర్చున్నపుడుగానీ గోళ్లను కొరుకుతుంటారు. అందుకే చేతులను ఎపుడూ బిజీగా ఉంచాలి. అంటే బొమ్మలు గీయడం, ఏదైనా రాయడం వంటివి చేయండి.
బాగా ఒత్తిడి ఉన్నపుడు కూడా గోళ్లు కొరకుతుంటారు. ఒత్తిడి నుంచి దూరమవడానికి యోగ, ధ్యానం, వ్యాయామం, రిలాక్సేషన్ పద్ధతులను ఉపయోగించండి. మీరు ఒత్తిడిని తగ్గించుకున్నపుడే మీపై మీకు స్వీయ నియంత్రణ ఉంటుంది.
మీరు ఇంట్లో ఉన్నపుడు గానీ, వాహనాన్ని నడిపేటపుడు గానీ మీ చేతులకు గ్లోవ్స్‌ను ధరించండి. దీనివల్ల గోళ్లు కొరికే అవకాశం ఉండదు.

మీరు క్రమంతప్పకుండా గోళ్లను కత్తిరించుకోండి. వాటిని ఎపుడు చిన్నగానే ఉంచుకున్నట్లయితే మీకు గోళ్లు కొరికే అవసరం ఉండదు.

మీ వెంట ఎపుడూ ఓ స్ట్రెస్ బాల్‌ను ఉంచుకోండి. మీకు ఎపుడైతే ఓపిక లేనట్టుగా అనిపిస్తుందో ఆ బాల్‌ను చేతిలో పెట్టుకుని ఒత్తిడి కలిగించండి. దానివల్ల మీకు మరింత ఉత్సాహం వస్తుంది. మీరు గోళ్లు కొరకడం కూడా మరిచిపోతారు.
మీకు మీరు కొన్ని గంటల పాటు గోళ్లు కొరకకూడదని లక్ష్యం పెట్టుకోండి. దానిలో విజయం సాధించగానే మిమ్మల్ని మీరే అభినందించుకోండి. తరువాత ఆ సమయాన్ని పొడిగించికుంటూ వెళ్లండి. కొద్దికాలం తరువాత మీకు గోళ్లు కొరికే అలవాటు ఉండదు.

మీ గౌరవాన్ని కాపాడుకోండి !

గోళ్లు కొరికే అలవాటు కొంత మంది అసహ్యంగా చూస్తారు. దీని మూలంగా నలుగురిలో అభాసుపాలు కావాల్సివస్తుంది. ఇది మీ ఆత్మగౌరవ లోపాన్ని, మానసిక అపసవ్య స్థితిని కూడా సూచిస్తుంది. అందుకే పైన పేర్కొన్న పద్ధతులను అనుసరించి మీ అలవాటుకు వీడ్కోలు చెప్పండి.

-డా. హిప్నో పద్మాకమలాకర్
సైకోథెరపిస్ట్, మ్యారేజ్‌ఫ్యామిలీహెల్త్ సైకలాజికల్ కౌన్సెలర్

Leave A Reply

Your email address will not be published.