హైదరాబాద్, విశాఖలో మ్యూజియంల ఏర్పాటు: మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధుల పేరుతో 10 నూతన మ్యూజియంలను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విశాఖపట్నంలో మ్యూజియంలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో రిమేజినింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా సమ్మిట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన భూమి అని, ఆజాదికా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న తరుణంలో.. మన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించటం, శాశ్వతంగా కొనసాగించటంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలో వెయ్యికి పైగా మ్యూజియంలు భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
తెలంగాణలో 5, ఎపిలో 6 కొత్త మ్యూజియంలకు గ్రాంట్ ఇస్తామని, ఇప్పటికే రూ.కోటి రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేశారని మంత్రి తెలిపారు. ఎపిలో రూ. 35 కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియం నిర్మాణం జరుగుతోంది, అల్లూరి జయంతి రోజున ప్రారంభిస్తామని తెలియజేశారు. హైదరాబాద్‌కు సైన్స్ సిటీని కేంద్ర మంజూరు చేసిందని, దీని నిర్మాణం కోసం 25 ఎకరాల స్థలం కేటాయించాలని సిఎంకు లేఖ రాశామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాం నగలను భద్ర పరిచేందుకు బవనం కేటాయిస్తే తీసుకురావడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కిషన్ రెడ్డి వెల్లడించారు.