మగ్గం ఉన్న కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్: లోకేశ్
రాష్ట్ర వ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటా

జమ్మలమడుగు (CLiC2NEWS): రాష్ట్రంలో మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్ర వైఎస్ ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోకేశ్ చేనేత కార్మికులతో మాట్లాడారు.
చేనేత కార్మికులకు బీమా పథకాన్ని రద్దు చేశారని, నేత కార్మికులకు ఇళ్లులేక ఇబ్బంది పడుతున్నారని.. షెడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందట్లేదని కార్మికులు లోకేశ్‌కు తెలిపారు. లో ఓల్టేజ్ కారణంగా ఇబ్బందులకు గురౌతున్నట్లు తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపుతామని లోకేశ్ కార్మికులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటానని లోకేశ్ అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే చేనేతపై ఉన్న 5% జిఎస్‌టి భారం పడకుండా చేస్తామన్నారు. కార్మికులకు ఇళ్లు, వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రన్న బీమా పథకాన్ని మళ్లీ ప్రవేశపెడతామన్నారు.