జి-20 శిఖ‌రాగ్ర స‌మావేశం..

ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజ‌ధానిలో ప్ర‌పంచ దేశాల ప్ర‌తినిధుల స‌మావేశం కొన‌సాగుతోంది. భార‌త్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న జి20 స‌ద‌స్సుకు ప్ర‌గ‌తి మైదానంలోని భార‌త్ మండ‌పం వేదికైంది. జి20 శిఖ‌రాగ్ర స‌ద‌స్సుకు దేశాల అధ్య‌క్ష‌లు, ప్ర‌ధాన‌మంత్రులు స‌మావేశ‌మ‌య్యారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్రారంభోప‌న్యాసం చేశారు. జి20 అధ్యక్ష హోదాలో భార‌త్ మీకు స్వాగ‌తం ప‌లుకుతోంద‌న్నారు. కొవిడ్ కార‌ణంగా నెల‌కొన్న‌ ప‌రిస్థితులు.. ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్ప‌డింద‌ని, అది యుద్ధం వ‌ల‌న మరింత బ‌ల‌ప‌డింద‌న్నారు. అంద‌రం క‌లిసి ఈ విశ్వాస రాహిత్యంపై పోరాడ‌దామ‌న్నారు. ప్ర‌పంచంలో పేద‌, సంప‌న్న దేశాల మ‌ధ్య భేదాలు, ఆహారం, ఇంధ‌నం నిర్వ‌హ‌ణ‌, హెల్త్, ఎన‌ర్జీ నీటి భ‌ద్ర‌త వంటి స‌మ‌స్య‌ల‌కు స‌మాధానం కోసం ముందుకు వెళ్లాల‌ని మోడీ అన్నారు. 55 దేశాలు స‌భ్యులుగా ఉన్న ఆఫ్రిక‌న్ యూనియ‌న్‌కు జి20లో శాశ్వ‌త స‌భ్యత్వం గురించి భార‌త్ ప్ర‌తిపాదిస్తోంద‌న్నారు. దీనికి అంద‌రూ అంగీక‌రిస్తార‌ని న‌మ్ముతున్నాన‌న్నారు.

ఆఫ్రిక‌న్ యూనియ‌న్‌కు స‌భ్యదేశాలు ఆమోదం తెలిపిన‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వెల్ల‌డించారు. స‌ద‌స్సులో ఢిల్లీ డిక్ల‌రేష‌న్‌పై స‌భ్య‌దేశాలు ఏక‌తాటిపైకి రావ‌డం భార‌త్ సాధించిన విజ‌యం.

భార‌త్ చొర‌వ‌, స‌భ్య‌దేశాల అంగీకారంతో ఆఫ్రిక‌న్ యూనియ‌న్ శాశ్వ‌త స‌భ్య‌త్వాన్ని పొందింది. జి20లో స‌భ్య‌త్వం .. ప్ర‌పంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్యానికి కేంద్రంగా మార‌నుంది.

Leave A Reply

Your email address will not be published.