స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర శాసన స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. శాసన సభ సమావేశాలు నాలుగు రోజుల విరామం అనంతరం గురువారం ప్రారంభమయ్యాయి. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక ప్రకటన అనంతరం సిఎం రేవంత్ రెడ్డి, బిఆర్ ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్, తదితర అధికార, విపక్షాల ఎమ్మెల్యే లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. కాగా స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేయడం. దానికి ప్రధాన ప్రతిపక్షం బిఆర్ ఎస్ తో పాటు మజ్జిస్, సిపిఐ మద్దుతు తెలపడంతో ఎన్నిక ఏక గ్రీవమైంది.
ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దాంః సిఎం రేవంత్
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన పార్టీలకు సిఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. మంచి సంప్రదాయానికి తొలిరోజే సభ నాంది పలికిందని తెలిపారు.
మంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించారని, ఆయనతో కలిసి పనిచేసినందుకు గర్విస్తున్నానని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు.
బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ ఆదేశాలతో స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినట్లు మాజీ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఎంపిటిసి నుంచి స్పీకర్‌గా ఎదిగిన గడ్డం ప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి సభ పని చేయాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.