భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఒకే ఒక దేశం భారతదేశం: చిరంజీవి

హైదరాబాద్ (CLiC2NEWS): ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నగరంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక మహోత్సవాలకు సినీ హీరో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
గతంలో తాను కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా పనిచేశానని, ఇపుడు అదే శాఖను మిత్రుడు కిషన్ రెడ్డి నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఒకే ఒక దేశం భారతదేశమని, మన సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల వివిధ ప్రాంతాల సంప్రదాయాలు, అభిరుచులు అందరికీ తెలుస్తాయన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి పెరిగిందని చిరంజీవి అన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ సాంస్కృతిక మహోత్సవాల్లో కళను, వృత్తిని నమ్ముకున్న పేద కళాకారులకు మాత్రమే అవకాశం కల్పించాలన్నారు. ఇందులో పెద్ద కళాకారులు, ప్రొఫెషనల్ కళాకారులు ఎవరూ లేరని, అందరూ మారుమూల గ్రామాల నుంచి వచ్చిన నిరుపేద కళాకారులేనని, వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంపి అర్వింద్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి, మాజి ఎంపి జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.