ప్రణాళికబద్ధంగా ఎస్టీపీల నిర్మాణ పనులు జరగాలి
హైదరాబాద్ (CLiC2NEWS): సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ఉత్పత్తయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,866.21 కోట్ల వ్యయంతో 31 కొత్త సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆయన అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కువ సామర్థ్యంతో నిర్మిస్తున్న అంబర్‌పేట, నాగోల్, నల్లచెరువు, ఫతేనగర్ ఎస్టీపీల నిర్మాణ పనులను ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో సివిల్ పనులకు ఆటంకం కలుగుతుంది కాబట్టి ఇప్పుడే వీలైనంత ఎక్కువ సివిల్ పనులు పూర్తి చేయాలని, ఇందుకు తగ్గట్లుగా పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎస్టీపీలకు అవసరమైన ఎలక్ట్రోమెకానికల్ ఈక్విప్మెంట్కు వెంటనే ఆర్డర్ చేయాలని నిర్మాణ సంస్థలను ఆదేశించారు. ఈ ఏడాది చివరి కల్లా ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో వేగంగా పనులు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఎస్టీపీ సీజీఎంలు, జీఎంలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
—