చంద్రయాన్-3: ఇస్రో మాజీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..

బెంగళూరు (CLiC2NEWS): చంద్రయాన్-3పై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మాజీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయి తన పరిశోధనలు కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు నిద్రాణ స్థితిలో ఉన్నాయి. గత నెల 22న చంద్రుడిపై సర్యోదయమైనప్పటికీ ల్యాండర్, రోవర్లు మేల్కోలేదు. వాటిని మేల్కొపడానికి ఇస్రో ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇస్రో మాజీ ఛైర్మన్ ఎఎస్ కిరణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్లు మేల్కొవడంపై ఇక ఆశ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఇంతటితో ముగిసినట్లేనని ఆయన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు. చంద్రయాన్ -3 నుండి ఇప్పటికే అనుకున్న ఫలితం ఇప్పటికే వచ్చిందని.. ఏ దేశానికి సాధ్యంకాని రీతిలో చంద్రుని దక్షిణ ధ్రవంపై కాలుమోపిందన్నారు. అక్కడినుండి విలువైన సమాచారాన్ని అందించిందని.. తదుపరి ప్రాజెక్టుల్లో ఇది కీలకంగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో చంద్రుడినుండి నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకొచ్చే ప్రాజెక్టులు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.