కోనేటి రంగయ్య: మనసు ఆరాటం
రాణా, నీ చెంతకు నే రానా,
నీ పసిప్రాయపు బోసినవ్వుల వెలుగుల్లో
తడిసి ముద్దవుతాను మురిపెంగా
కానీ రానా, రాలేను నేను అంత అలవోకంగా
అన్నీ అవరోధాలే అడ్డంకులే
దూర భారమే కాదు మూసిన దారులు
ఆరు నెలల ప్రాయంలో నీవు
అరవై ఏళ్ల పై వయస్సులో నేను
పరిగెత్తి కలుసుకునే స్థితిలో లేము
నడక నేర్వని నిన్ను
పరిగెడుతూ ఎలా రమ్మని పిలిచేది
సప్త సముద్రాల ఆవల నీవు.
ఖండాంతారాలను అధిగమించాలి మనం
ఆదరిలో నీవు, నీ దరికి నే రాలేక
మనో నేత్రంతో చూడగలనేమో కానీ
వాయు వేగంతో వచ్చి వాలేకున్నా
నిను చూడాలని, లాలించాలని,
బాహుళ్లోకి తీసుకోవాలి,హృదయానికి హత్తు కొని
ముద్దులిడాలని,ఆరాటం నాకు
మన కలియికకు అడ్డుగా నిలిచి,నిలిపింది
విశ్వాన్ని కప్పేసిన కరోనా మహమ్మారీ
లోహ విహంగాలను కట్టడి చేసింది
కనిపించని ఆ సూక్ష్మ జీవి
మన మధ్య అడ్డుగోడైంది
నా ఆకాశయానానికి అంతరాయం కలిగింది
నిన్ను చేరేందుకు నాకు విహంగాలు లేవు
నిన్ను చేరాలని, చూడాలనే తలంపు
తహతహలాడుతున్న మనస్సుకు
కళ్లెం వేయడం కష్టంగానే ఉంది.
నీ దేశం, నాదేశం సై అంటేనే కదా
అప్పటిదాకా తప్పదు ఈ దూరం మన మధ్య.
-కోనేటి రంగయ్య
సీనియర్ పాత్రికేయులు