Mandapet: జిల్లాలో లక్షా 50 వేల మందికి వ్యాక్సిన్..
మండపేటలో వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించిన డి ఎం అండ్ హెచ్ వో డాక్టర్ గౌరీశ్వరరావు..

మండపేట(CLiC2NEWS): రాష్ట్ర వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా జిల్లాలో నేడు లక్షా 50 వేల మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.వి.ఎస్. గౌరీశ్వరరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కరోనా టీకాలు వేసే కేంద్రాల పరిశీలనలో భాగంగా డిఎంఅండ్ హెచ్ వో మండపేట లోని వ్యాక్సిన్ వేసే కేంద్రాలను పరిశీలించారు. ప్రాధాన్యత క్రమంలో అందరికీ వ్యాక్సిన్ వేయాలని ఎక్కడ నిబంధనల ఉల్లంగించ వద్దని అక్కడ డాక్టర్లను సిబ్బందిని ఆదేశించారు. వ్యాక్సిన్ వేసే ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందజేసి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రతి చోట వ్యాక్సిన్ వేసే ప్రక్రియ చురుగ్గా సాగుతుందని 1 లక్ష 45 వేల మందికి వ్యాక్సిన్ వేసే ప్రక్రియను మొదలు పెట్టామన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారికి అలాగే ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్లకు , 5 సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు మొదట ప్రాధాన్యతగా వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. అలాగే కోవీషీల్డ్ రెండో డోసు కూడా వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు సాయంత్రానికి అనుకొన్న లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల ప్రజలంతా స్వచ్చందంగా వచ్చి వ్యాక్సిన్ వేయించు కుంటున్నారని తెలియజేశారు. త్వరలో 18 సంవత్సరాలు దాటిన వారికి కూడా వ్యాక్సిన్ వేసే ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ముఖ్యంగా జిల్లాలో జిజిహెచ్ తోపాటు అన్నిచోట్ల బెడ్స్ చాలా వరకు ఖాళీగా ఉన్నాయని అన్నారు. జిల్లాలో కోవిడ్ కేసులు చాలా వరకు తగ్గుముఖం పడుతున్నాయని నాలుగైదు రోజుల్లో మరింత తగ్గుముఖం పడతాయని చెప్పారు. ప్రస్తుతం పాజిటివ్ రేటు 5 శాతం ఉందని ఇది మరింత తగ్గుతుందని వివరించారు. అలాగే కరోనా వైరస్ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్లక్ష్యం పనికి రాదు అన్నారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలి అని భౌతిక దూరం పాటించాలి అని చెప్పారు. ఆయన వెంట మండపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు హేమలత, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తదితరులు ఉన్నారు.