పెళ్లి వేడుకలో ఫుడ్ పాయిజన్..17 మందికి అస్వస్థత
మండపేట (CLiC2NEWS): మండపేటలోని ఓ వివాహ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. ఆహారం విషతుల్యమై 17 మంది అస్వస్థకు గురయ్యారు. వీరందరినీ కూడా తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో 108 అంబులెన్స్‌లలో మండపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యురాలు వాహిని ప్రియాంక సకాలంలో చికిత్సనందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మంది కూడా ప్రస్తుతం కోలుకుంటున్నారు. బాధితులంతా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల వారుగా తెలిసింది. విందులో వేసిన గుమ్మడి హల్వా తిన్న కొన్ని గంటల తర్వాత అందరికీ తేడాగా అనిపించిందన్నారు. వాంతులు, విరేచనాలు, గాబరా, తలతిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం జరిగాయని చెప్పారు. 150 మంది వరకూ కేటరింగ్ భోజనాలు తినగా 17 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వేగుళ్ల..
పెళ్లి వేడుక భోజనాలు తిని అస్వస్థతకు గురైన బాధితులను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పరామర్శించారు. మీడియా ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్న వారిని పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ తో మాట్లాడి వీరి పట్ల శ్రద్ధ తీసుకుని అనుక్షణం పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.