Mandapeta: `మున్సిపల్ యూజర్ ఛార్జీలు తగ్గించండి..`

మండపేట (CLiC2NEWS): ప్రస్తుత పరిస్థితులలో యూజర్ చార్జీల పేరిట ప్రజలపై అదనపు భారం మోపడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని, శానిటేషన్ పేరిట చార్జీలు వసూలు చేస్తే తాము త్వరలో పోరాటం చేస్తామని మండపేట మున్సిపల్ కౌన్సిలర్లు చుండ్రు వీర వెంకట సుబ్బారావు చౌదరి, యరమాటి గంగరాజు, కాసిన కాశీవిశ్వనాథం, కాళ్ళకూరి స్వరాజ్య భవాని, గుండు రామ తులసి, చింతలపూడి దుర్గ హెచ్చరించారు. పట్టణ తెలుగుదేశం కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి రూ 10 రూపాయలు చిన్న వర్తకుల నుండి 150 రూపాయలు వ్యాపారస్తుల పై పన్నెండు వందల రూపాయలు వసూలు చేయాలని కౌన్సిల్ అజెండాలో చేర్చగా దీనికి వారు అంగీకరించకపోవడంతో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో తామంతా పట్టణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాకౌట్ చేయడం జరిగిందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ పన్ను పెంపుదలకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుపుదల చేశారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల వరకు నాయకులంతా సంక్షేమం అభివృద్ధి అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడటం సమంజసం కాదన్నారు. కరోనా తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు యూజర్ చార్జీల పెంపు మరింత ఊబిలోకి నెట్టుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వాకౌట్ చేశామన్న భయంతో గృహాలకు రూ.1080/- నుండి రూ 720/- లకు తగ్గించారని అప్పుడు రూల్సు ఎలా అగీకరించాయని ప్రశ్నించారు. నెలకు రూ.10/-లు చేస్తే ఎందుకు రూల్సు అంగీకరించవో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు అనంతరం ప్రజలు ఏమైపోయినా తమకు సంబంధంలేదని భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శానిటేషన్ యూజర్ చార్జీ పన్ను పూర్తిగా రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.