Mandapeta: విజయం చారిటబుల్ ట్రస్టు సేవలు అభినందనీయం..
చైర్ పర్సన్ రాణి ఆధ్వర్యంలో శానిటేషన్ సామాగ్రి పంపిణీ..
మండపేట (CLiC2NEWS): మండపేట పట్టణంలో విజయం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సంస్థ సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి పేర్కొన్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సంస్థ సభ్యులు శానిటేషన్ సామాగ్రి సమకూర్చారు. శుక్రవారం కార్యాలయంలో చైర్ పర్సన్ రాణి, కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ చేతులమీదుగా వాటిని కార్మికులకు పంచి పెట్టారు. ఒక్కొక్కరికీ రెండు మాస్కులు, అర లీటర్ కొబ్బరినూనె, రెండేసి సేవలాన్ సబ్బులు చొప్పున వారికి అందజేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ రాణి మాట్లాడుతూ విజయం స్వచ్ఛంద సంస్థ సేవలు మరింత విస్తృతం చేయాలని సభ్యులను అభినందించారు. మున్సిపాలిటీలో పనిచేసే మొత్తం 158 మందికి సామాగ్రి ఏర్పాటు చేసినట్లు ట్రస్టు సభ్యులు బొమ్మకంటి విజయ్ మోహన్ చెప్పారు. 35 వేలు విలువ గల కిట్లు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ముత్యాల సత్తిరాజు, సంస్థ అధ్యక్షుడు రెడ్డి ఆశిస్, కె కాళీ కృష్ణ, ఎన్ సాయి శ్రీనివాస్, బి హరికృష్ణ, వి మణిదీప్ రెడ్డి, బి అయ్యప్ప, షేక్ సూరజ్, పి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.