అందరికీ మానసిక ఆరోగ్యరక్షణ: దీనిని నిజం చేద్దాం

మానసిక ఆరోగ్యం సమస్యకాదు

మానసిక ఆరోగ్య దినోత్సవం స్పెషల్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్యదినం నిర్వహిస్తోంది. ప్రపంచ మానిసిక ఆరోగ్య సంస్థ అయిన వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ చొరవతో 1992 నుంచి వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది ఒక థీమ్‌ను తీసుకుని ప్రచారం చేస్తారు. 2021లో అందరికీ మానసిక ఆరోగ్యం అనే అంశాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ ఏడాది ‘అసమాన ప్రపంచంలో మానసిక ఆరోగ్యం’ అనే అంశాన్ని ఎంచుకున్నారు.

ఈ సందర్భంగా అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏమిటీ?

మనం ఎంత వరకు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నామో తెలుసుకుందాం..

మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి?

మానసిక ఆరోగ్యమంటే ఎలాంటి అనారోగ్యము లేకుండా ఉండడం కాదు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడం. ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, ప్రవర్తిస్తాడు, అందరితో ఎలా ఉంటాడు అన్న విషయం అతని మానసిక ఆరోగ్యస్థితిని నిర్దారిస్తుంది.

మానసిక ఆరోగ్యం ఎందుకు ముఖ్యమైనది

నిత్య జీవితంలో మనం ఎన్నో ఒత్తడిలు ఎదుర్కొంటాం. ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, కుటుంబ సమస్యలతోనో ప్రతి ఒక్కరికి తీవ్ర ఒత్తడి కలగడం సర్వసాధారణం. చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కొద్దిగా టెన్షన్‌ పడతాం.. సమస్య తీరగానే మళ్లీ మామూలుగా అయిపోతాం. కొన్ని సార్లు అవి తీవ్రమై ఒక సమస్యగా రూపాంతరం చెందుతాయి. ఈ పరిస్థితులు తీవ్రమై మనిషి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీంతో మిగతా వాళ్ళతో ఆ వ్యక్తి ప్రవర్తన తీరు మారిపోతుంది. అయితే ఇలాంటి స్థితి
మనం అందరం చెప్పుకున్నట్టు పిచ్చి కాదు. ఇది కూడా ఒక ఆరోగ్య సమస్యగా గుర్తించాలి.

ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే అన్నింటినీ సమానంగా స్వీకరించగలగాలి. మన పెద్దవాళ్ళు చెప్పినట్లు కష్ట సుఖాలు కావడి కుండలని గుర్తించాలి. కష్టం వచ్చిందని కృంగి పోకూడదు. జీవితం అంటేనే భరించాల్సినదని అర్ధం. అలా సమస్యలను భరించాల్సి వచ్చినప్పుడే మనం మానసిక దృఢత్వం బయటడుతుది. ఇలాంటి సమయంలోనే మనలోని శక్తి సామర్ధ్యాలను సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కొక్కళ్ల మానసిస స్థాయి ఒక్కో రకంగా ఉంటుంది. అందరూ ఒకే రకంగా ఉండరు. కండలు తిరిగి ఎంతో ధైర్యంగా కనిపించే వాళ్ళుకూడా సినిమాల్లో ట్రాజడీ సీన్‌లు వస్తే ఏడ్చేస్తుంటారు. అంటే వాళ్ళు బలహీనులని కాదు. సున్నిత మనస్కులు. పైకి ఎంత గంభీర్యంగా కనిపించినా మనసిక స్థితిమాత్రం ఆకారాన్ని బట్టి ఉండదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ వ్యక్తి స్పందించే తీరు మానసిక స్థితి తెలుస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో ఉంటుంది. జీవితంలో ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఒక్కరు ఆ ప్రభావంనుంచి ఒక్కరోజులోనే బయటపడవచ్చు. మరొకరు సాధారణ మనిషి కావడానికి చాలాకాలం పట్టవచ్చు.

అలా అని ఒక వ్యక్తిలోని మానసిక ఆరోగ్యం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. వివిధ దశల్లో అది మారిపోతుంది. పరిస్థితులు మారినప్పుడు మారిపోతుంది. ఉదాహరణకు యువకుడిగా ఉన్నప్పుడు వాహనాన్ని అత్యంత వేగంగా నడిపే వ్యక్తి.. పెళ్ళై పిల్లలు పుట్టిన తరువాత అంత స్పీడుగా వాహనం నడపడు. అలా అని అతనిలోని బండి నడిపే శక్తి తగ్గిందని కాదు. యువకుడిగా ఉన్నప్పుడు ఏమైనా చేయగలం.. మనకు ఏమీ కాదు అనే మానసిక ధైర్యం ఉంటుంది. అదే మధ్య వయసు వచ్చేసరికి బండి వేగంగా నడిపితే స్కిడ్‌ అయి యాక్సిడెంట్‌ అవుతుందేమో… నాకు ఏమైనా అయితే భార్య పిల్లలు ఇబ్బంది పడతారని నెమ్మదిగా డ్రైవ్‌ చేస్తారు. అంటే ఒకే వ్యక్తి సందర్భాన్ని బట్టి అతని మానసిక స్థితి మారింది. పెద్దవాడైన తరువాత బండి నెమ్మదిగా నడుపుతున్నాడంటే అతని మానసిక ఆరోగ్యం తగ్గిందని కాదు. అతనిపై ఉన్న బాధ్యతలు అతనికి ఆ మానసిక స్థిరత్వాన్ని తెచ్చాయి.

మానసిక ఆరోగ్యమంటే మనకు చిన్నచూపు

మనం తలనొప్పి గురించి మాట్లాడే విధంగా మానసిక ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడలేము. అందుకు మనకు చిన్నతనం నుంచి మానసిక అనారోగ్యం అంటే పిచ్చి అనే ఒక భావన మన మనసుల్లో నాటుకు పోయింది. అందుకే ఇప్పటికీ మన సమాజంలో మానసిక అనారోగ్యాన్ని ఏహ్యంగా చూస్తారు. ఎవరైనా దాని గురించి మాట్లాడుతుంటే దూరంగా వెళతారు.

మానసిక అనారోగ్యం బలహీనత నుండి పుట్టుకొచ్చింది. ఏ విషయంలోనైనా బలహీనత మంచిది కాదని మనకు చిన్నప్పటినుండి చెబుతారు. శారీరక అనారోగ్యం వస్తే వైద్యుల దగ్గరకు తీసుకెళతాం.. మందులు వాడితే తగ్గిపోతుంది. మానసిస ఆరోగ్యం కూడా అలాంటిదే. మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తిని దోషిలా చూస్తాం. దూరం పెడతాం. సమాజంలో అతని దగ్గరకు వెళ్ళేందుకు ఎవరూ సాహసించరు. దీంతో ఆ వ్యక్తిలో సమస్య మరింత తీవ్రమవుతుంది. ఒక వ్యక్తి మానసిన అనారోగ్యంతో బాధపడుతుంటే.. అది అతని మానసిక బలహీనతగా భావిస్తాం.

నువ్వు ఒంటరివి కాదు

మానసిక ఒత్తడి కలిగినప్పుడు… మనం ఒంటరి కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మన చుట్టూ ఉన్నవాళ్ళలో మనకు దగ్గరైనా వాళ్ళు, లేదా మనం నమ్మదగిన వాళ్ళు ఒకరో ఇద్దరో అయినా ఉంటారు. మీ సమస్యను వాళ్లతో పంచుకోండి. వాళ్ళు మన సమస్యను తీర్చగలరా అని ఆలోచించవచ్చు. సమస్యను తీర్చలేక పోవచ్చు. కానీ సమస్యను ఇతరులతో పంచుకోవడం వలన మనం కోలుకోవడానికి మొదటి అడుగు పడుతుంది. అలా మనసు తేలికపడితే సమస్యను పరిష్కరించడానికి మార్గాలు కనిపిస్తాయి.

సామాజిక మాధ్యమాలు అండగా సాగిపో..

ప్రస్తుతం మనకు అందుబాటులో ఎన్నో సామాజిక మాధ్యమాలు ఉన్నాయి. వీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం ఇట్టే లభిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో మనకు ఎంతో మంది మిత్రులు ఉంటారు. మన సమస్యను ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వాళ్ళతో పంచుకుంటే ఎన్నో పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. వాటి సాయంతో మనం సమస్యలనుంచి బయటపడవచ్చు.

మానసిక ఆరోగ్య సమస్యలు ఏమిటి?

మానసిక ఆరోగ్య సమస్యలు రోజువారీ జీవితంలో భాగంగా మనందరం అనుభవించే ఆందోళనలపై ఆధారపడి ఉంటాయి. పరిస్థితులను బట్టి సాధారణంగా లేదా తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలుగా ఉంటాయి. మెంటల్ హెల్త్ సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువ మంది సరైన సమయంలో సలహాలు తీసుకుంటే వాటిని అధిగమించవచ్చు లేదా వాటితో జీవించడం నేర్చుకోవచ్చు

మానసిక అనారోగ్య లక్షణాలు

మానసిక సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి దిగులు, ఆందోళన, నిద్ర లేమి, ఎక్కువ లేదా తక్కువ తినడం, ఎవరితో మాట్లాడకుండా ఉండటం, సెల్ ఫోన్, టివికి ఎడిక్ట్ అవడం, అరవడం, స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్ వంటివి. బైపోలార్ లో తీవ్రమైన దిగులు, కోపం, చిరాకు, మొదలైనవి ఉంటాయి. వీళ్లలో ఆత్మహత్య కి సంబంధించి ఆలోచనలు కూడా ఎక్కువ ఉంటాయి. స్కిజిఫ్రెనియ లో తనలో తాను మాట్లాడుకోవడం, భయం, అనుమానం మొదలైనవి ఉంటాయి. గతంలో ‘న్యూరోసిస్’ అని పిలవబడే పరిస్థితులు ఇప్పుడు తరచుగా ‘సాధారణ మానసిక ఆరోగ్య సమస్యలు’ అని పిలువబడుతున్నాయి.

‘సైకోటిక్’ లక్షణాలు

ఇవి వాస్తవికతపై ఒక వ్యక్తి అవగాహనా శక్తికి ఆటంకం కలిగిస్తాయి. ఇతరులు చూడలేని వాటిని చూస్తున్నట్లు, వినికిడి, వాసన లేదా అనుభూతి వంటి భ్రాంతులను కలిగి ఉండవచ్చు. మానసిక ఆరోగ్య సమస్యలు మీరు ఆలోచించే, భావించే మరియు ప్రవర్తించే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. అవి సైకియాట్రిస్ట్ నయం చేయగలిగిన సమస్యలే. వ్యక్తిగత బలహీనతలు కాదు. మన చుట్టు ఉన్న వాళ్ళలో ప్రతి ఆరుగురిలో ఒకరు మానసిక ఆరోగ్యసమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే ప్రతి 10 మందిలో ఒకరు డిప్రషన్‌, ఆందోళన వంటి సాధారణ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

మానసిక ఆరోగ్య సమస్యలు ప్రజలను ఎలా ప్రభావితం చేస్తాయి?

ఆందోళన మరియు డిప్రెషన్ తీవ్రంగా మరియు దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇది ప్రజల సాధారణ జీవితాన్ని గడపడంపై ప్రభావాన్ని చూపుతుంది. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళలో చాలామంది తమ సమస్యలను దాచడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే తన సమస్యను చెబితే ఎదుటి వ్యక్తులు ఎక్కడ తమపై ఒక ముద్రవేస్తారో అని భయపడతారు. అలాగే వైద్య సాయం పొందడాని కూడా ఆసక్తి చూపడంలేదు. పైకి నార్మల్‌గా కనిపిస్తున్నంత మాత్రాన వాళ్ళకు రెగ్యులర్‌ లైఫ్‌లో ఎలాంటి సమస్యలు లేవనుకోవడానికి వీలులేదు.

మాన సిక ఆరోగ్యానికి పది సూత్రాలు

1. నేర్చుకునే సామర్థ్యం

మంచైనా, చెడైనా మీ మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి వెనుకాడవద్దు.తోటి వ్యక్తులతో మంచి సంబంధాలు ఏర్పరచుకునేందుకు ప్రయత్నించండి. సమస్య ఎదరైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పెంచుకోండి
మీ భావాలనే ధైర్యంగా వ్యక్తీకరించడం వలన మీరు మానసిక ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

2. చురుకుగా ఉండండి.

రెగ్యులర్ వ్యాయామం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఏకాగ్రత, నిద్రతో పాటు మంచి అనుభూతిని కలిగిస్తుంది. వ్యాయామం మెదడు మరియు మీ ఇతర ముఖ్యమైన అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

3. బాగా తినండి

మీ శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే మీ మెదడు ఆరోగ్యంగా ఉండటానికి, బాగా పనిచేయడానికి పోషకాల మిశ్రమం అవసరం. మంచి ఆహారం మీ శారీరక ఆరోగ్యానికే కాదు మీ మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది.

4. తెలివిగా తాగండి

మానసిక స్థితిని మరగు పరచుకోవడానికి కొందరు తరచుగా మద్యం అలవాటు పడతారు. మరి కొంతమంది భయం లేదా ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి తాగుతారు. కానీ ఆ ప్రభావం తాత్కాలికం మాత్రమే. మద్యం తాగినప్పుడు అందులోని ఆల్కహాల్‌ మీ మెదడును, శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది తాత్కాలికంగా సమస్యను మరచిపోయేలా చేసినా ఆ తరువాత మరింత బాధపడతారు. సమస్యలనుంచి బయటపడడానికి మద్యపానం మంచిది కాదు.

5. సన్నిహితంగా ఉండండి

ఒకరితో ఒకరు ముఖాముఖి మాట్లాడుకోవడం కంటే మెరుగైనది మరొకటి లేదు. ప్రతిసారి అది సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఫోన్‌ చేసిమాట్లాడవచ్చు. లేదా మెసేజ్‌ పంపవచ్చు. ఆన్‌లైన్‌లో ఛాటింగ్‌ చేయొచ్చు. మాట్లాడాలనుకుంటే ఏదోఒక మార్గం ఉంటుంది.

6. సహాయం కోసం అడగండి

మనలో ఎవరూ మానవాతీత వ్యక్తులు కాదు. మనం అనుకున్న పనులు కాకపోతే డిస్ట్రబ్‌ అవుతాము. నిరాశ చెందుతాం. అలాటి సంఘటనలు జరిగినప్పుడు ఒంటిరిగా ఆలోచించవచ్చు. ఇతరులను సహాయం అడగండి. మీకుటుంబ సభ్యులు లేదా స్నేహితులు సమస్యను పరిష్కరించే సలహాలు ఇవ్వవచ్చు. లేదా ఇతరులతో మీ సమస్యను పంచుకున్నప్పుడు మీలో ఒత్తిడి తగ్గిపోతుంది.

7. విరామం తీసుకోండి

ఏదైనా సమస్య మిమ్నల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు మీ మనసును ఆ పనిమీదనుంచి మరో పని పైకి దృష్టి మరల్చుకోండి. ఉదాహరణకు వంటగదిని శుభ్రం చేసుకోండి. పది నిమాషాలు విరామం లభిస్తంది. లేదా పనిలో ఒత్తడి ఎక్కువైతే భోజన విరామం తీసుకోండి. అరగంట తరువాత మళ్లీ ఫ్రెష్‌గా ఆ పని మొదలుపెట్టండి. వారాంతరాల్లో కొత్తకొత్త ప్రదేశాలు చూడడానికి సమయం కేటాయించండి.

8. మీకు నచ్చినది ఏదైనా చేయండి

మీరు ఏ పని చేయడానికి ఇష్టపడతారు? ఏ పనిచేస్తే మిమ్మల్ని మీరు మర్చిపోతారు? గతంలో ఏ పనులంటే ఇష్టపడేవారో గుర్తు చేసుకోండి. ఆ పనులను ఆస్వాదిస్తుంటే మీ మెదడు ఒత్తిడిని అధిగమించడానికి ప్రిపేర్‌ అవుతుంది. మీరు సంతోషంగా ఉంటే కార్యక్రమాలు చేయడం అంటే మీరు సంతోషంగా ఉన్నారని అర్ధం. అది మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. అలా సమస్యను ఎదుర్కోవడానికి అవసరమైన దృఢత్వాన్ని ఇస్తుంది.

9. మీరు ఎవరో తెలుసుకోండి

ఇతరులకంటే భిన్నంగా మన ప్రవర్తన ఉందని అనిపించినప్పుడు దానిని మీరు అంగీకరించండి. సాధ్యమైనంత వరకు దానినుంచి బయటపడే మార్గాలను అన్వేషించండి. కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడంపై దృష్టి సారించండి. కొత్త ప్రదేశాలను సందర్శించడానికి, కొత్త స్నేహితులను సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జీవితం కష్టమైన మలుపు తిరిగినప్పుడు ఆత్మగౌరవం మీకు సహాయం చేస్తుంది.

10. ఇతరుల కోసం శ్రద్ధ వహించండి

స్నేహితులు ఎంతో ముఖ్యం. వీలయినప్పుడల్లా వారికి అవసరమైన సాయం చేయండి. వారికి కష్టం వచ్చినప్పుడు సపోర్ట్‌ చేయండి. అది మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేస్తుంది.

-డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్, హిప్నో థెరపీస్ట్

Leave A Reply

Your email address will not be published.