మంథని లో `అన్నారం` బ్యాక్ వాటర్ పంట ముంపు రైతుల ధర్నా

మంథని (CLiC2NEWS): పెద్దపెల్లి జిల్లా మంథని మండలంలో అన్నారం బ్యాక్ వాటర్ ముంపు బాధితుల ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని ఎక్లాస్‌పూర్, ఖానాపూర్, కాన్సాపేట మూడు గ్రామ సంచాయితీల రైలులంతా మంథని- కాటారం రహదారిపై గురువారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అన్నారం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మంథని మండలంలోని ఎక్లాస్‌పూర్, ఖానాపూర్, కాన్సాపేట మూడు గ్రామ సంచాయితీలలో దాదాపు 2 వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయని రైతులు తెలిపారు. అన్నారం ప్రాజెక్టు నీటితో ఇతర ప్రాంతాల్లో పంటలు పండుతున్నాయని, కానీ ఇక్కడ పంటలు గత 48 గంటలుగా నీట మునిగి ఉన్నాయని వాపోయారు. దాదాపు 2 వేల ఎకరాల పంట నీట మునిగితే ఒక్క అధికారి కూడా ఇప్పటి వరకు సందర్శంచలేదని తెలిపారు. వర్షాలు భారీగా కురిసినప్పుడు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో పంట పొలాలు ఎప్పుడూ నీట మునుగుతున్నాయని.. దీని మూలంగా రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని వాపోయారు. గతంలో పలుమార్లు ధర్నాలు చేసినా నాయకులు, అధికారులు పట్టించుకోవడంలేదని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్కరూపాయి నష్ట పరిహారం ఇవ్వలేదని, మరో నెల రోజుల్లో పంట కోతకు రానున్న సందర్భంలో పంట నీటి పాలు కావడంతో రైతులకు దిక్కుతోచడంలేదని ఆందోళన చెందారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగిన నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరారు.

బ్యాక్ వాటర్ మా భూముల్లోకి వచ్చి దాదాపు 48 గంటలు దాటి పోయినా కానీ నాయకులు, అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆర్డీఒ, ఎమ్మార్వో ఎవరూ ఈ మూడు గ్రామపంచాయతీలలోని ముంపు ప్రాంతాలను పరిశీలించలేదని ఆరోపించారు. నాయకులు, అధికారులు న్యాయం చేయాలని పలువురు రైతులు కోరారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నీట మునిగిన పంట నష్టం అంచనావేసి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మూడు గ్రామ పంచాయతీలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ధర్నాతో మంథని- కాటారం రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

