మండ‌పేట‌లో ఘనంగా నాగుల చవితి వేడుకలు..

మండపేట (CLiC2NEWS): మండ‌పేట‌ నియోజక వర్గంలోని మూడు మండలాల్లో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగదేవతను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. తమను తమ కుటుంబాన్ని చల్లగ చూడు తల్లీ అని ప్రజలు నాగ దేవతకు మొక్కారు. శుక్రవారం చవితి పండుగ సందర్భంగా తెల్లవారు జామునే తల స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి సాంప్రదాయ రీతిలో వేడుకలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా భక్తులు పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. గొల్లపుంత, రావులపేట, బ్యాంక్ కాలనీ శివారు ప్రాంతాలు, మారేడుబాక, వడ్డావారి తోట తదితర ప్రాంతాల్లో ఉండే పుట్టలు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. నాగదేవతకు గుడ్లు, పాలు, చెరకు, చిమ్నీ వంటి నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. మహిళలు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. పచ్చని పంట పొలాల మధ్య ఉన్న పుట్టల వద్ద భక్తుల సందడి కనువిందు చేసింది. ఓ పక్క చల్లని గాలులు వీయడంతో ఆహ్లాదకర వాతావరణంలో చిన్నారులు సందడి చేశారు. టపాసులు కాల్చి కేరింతలు కొట్టారు. పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పాపమ్మ పేరంటాలమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆయా ప్రాంతాలు భక్తుల రద్ధీతో ఆధ్యాత్మికత ఉట్టిపడింది.

Leave A Reply

Your email address will not be published.