AP: మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం?

అవస్థలు పడుతున్న రోగులు..

మండపేట (CLiC2NEWS): పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు గా ఉంది మండపేట ప్రభుత్వ ఆసుపత్రి ప‌రిస్థితి. ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వాసుప‌త్రికి రోగులు వస్తే వారిని ప‌ట్టించుకునే నాధుడు ఉండడు. డాక్టర్లు అంతంతమాత్రంగానే ఈ ఆసుపత్రిలో ఉంటారని పేషెంట్లు ఆరోపిస్తున్నారు. డాక్టర్లు స‌రిగా అందుబాటులో లేకపోవడంతో నర్సులదే పెత్తనంగా మారిందని. ..  దాంతో చికిత్సకు, ప్రాథమిక చికిత్సకు కూడా రోగులు నర్సులపై ఆధారపడవలసి వస్తుందని ప‌లువురు రోగులు వాపోతున్నారు. దాంతో వైద్యం కోసం వ‌చ్చే వారిపై సిబ్బంది చీదరింపులు చీత్కారాలు ఎదుర్కోవల‌సి వ‌స్తుంద‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు.

వివరాల్లోకెళితే 10 ఏళ్ల బాలుడికి కుక్క కరచిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన తండ్రి తీసుకొచ్చాడు. ఇలా కుక్క కరిచింది… వెంటనే వైద్యం చేయాలి… యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వండి అంటూ డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ లను సదరు బాలుడి తండ్రి కోరాడు. దాంతో అక్క‌డ ఉన్న వైద్య సిబ్బంది సంబంధంలేని ప్ర‌శ్న‌లు వేస్తూ వైద్యం చేయడానికి తాత్సర్యం చేశారు.  ఇదేమి చోద్యం అని అడిగిన పాపానికి పోలీసులకు ఫోన్ చేయడంతో అక్కడ ఉన్న రోగులు, బాలుడు తండ్రి నిర్ఘాంతపోయారు.

సామాన్యులకు ప్రతిరోజు ఈ విధంగా సంబంధిత సిబ్బంది నుండి వింత వింత అనుభవాలు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రి అంటే నిరుపేదలు వైద్య చికిత్స కోసం వస్తుంటారు. నిరుపేదలను పట్టించుకోకుండా సెల్ ఫోన్స్ లో వాట్సాప్ లు చూసుకుంటూ ఆనందించడం ఇక్క‌డి సిబ్బందికి పరిపాటిగా మారింది.

బాలుడు తండ్రి మండపేటలో పేరెన్నికగ‌ల‌ వ్యక్తి కావడంతో సంబంధిత విషయాన్ని శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులకు ఫిర్యాదు చేశారు. వెంటనే తోట త్రిమూర్తులు స్పందించి ఒకటో వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి ప్రసాద్ కు ఫోన్ చేసి విషయం తెలుసుకుని వెంటనే చికిత్స చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. అప్పటికి వచ్చిన కానిస్టేబుల్ నర్సు ఉదంతం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. సదరు బాలుడు తండ్రి వివరాలు చెప్పినప్పటికీ నర్సు పట్టించుకోకుండా ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తించడం విశేషం. ఈ లోపుగా అక్కడకు చేరుకున్న ఒకటో వార్డు కౌన్సిలర్ వైద్య సిబ్బందితో మాట్లాడి కుక్క కరిచిన బాలుడికి సత్వరమే ప్రాథమిక చికిత్స చేయించడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.