Pollution Effect: ఢిల్లీలో పాఠశాలలు మూసివేత!

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీని వాయుకాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కాలుష్యంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో స్పందించిన రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ సోమ‌వారం నుంచి ఢిల్లీలో మొత్తం పాఠ‌శాల‌ల‌ను వారం రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వాతావరణ పరిస్థితులపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మీడియాకు స‌మావేశ వివరాలు వెల్లడించారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు పాఠశాలలను ప్రత్యక్ష తరగతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో ఒక వారంపాటు వర్క్‌ఫ్రం హోం విధానంలో పని చేస్తాయని, ప్రైవేటు కార్యాలయాలు ఉద్యోగులకు సైతం వీలైనంత వరకు వర్క్‌ఫ్రం హోం ఇవ్వాలని సూచించారు. న‌గ‌రంలో దుమ్ము రేగ‌కుండా అన్ని నిర్మాణ కార్య‌క్ర‌మాల‌ను సైతం 4 రోజుల‌పాటు నిలిపి వేయాల‌ని ఆదేశించారు. ఢిల్లీలో రెండు రోజులు లాక్‌డౌన్‌ పెట్టాలనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంతో చర్చించి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Leave A Reply

Your email address will not be published.