సినిమా థియేట‌ర్‌ల బంద్ వ్య‌వ‌హారం.. స్పందించిన ఆర్ నారాయ‌ణ‌మూర్తి

హైద‌రాబాద్ (CLiC2NEWS): గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌డం గ‌ర్వంగా ఉంద‌ని సీనియ‌ర్ న‌టుడు , నిర్మాత ఆర్ నారాయ‌ణ‌మూర్తి అన్నారు. అవార్డుల విజేత‌ల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఆయ‌న సినీ ప‌రిశ్ర‌మ‌లో తాజాగా నెల‌కొన్న ప‌రిణామాల‌పై స్పందించారు. ప‌ర్సంటేజ్‌ల విష‌యంలో సినీ ప‌రిశ్ర‌మ‌లో ఈ మ‌ధ్య వివాదం నెల‌కొంద‌ని.. ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ కోస‌మే జూన్ 1 నుండి థియేట‌ర్లు బంద్ చేస్తున్నార‌నేది అబ‌ద్ధం అన్నారు. ప‌ర్సంటేజ్ ఖ‌రారైతే త‌న‌లాంటి వారికి ఎంతో మేటు చేకూరుతుంద‌న్నారు. ప‌ర్సంటేజ్ కోరుకునే వ్య‌క్తుల్లో తానుకూడా ఒక‌ర‌న్నారు. ప‌ర్సంటేజ్ విష‌యం ఒక కొలిక్కి వ‌చ్చే ద‌శ‌లో ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ కు లింకు పెట్ట‌డం స‌రికాద‌ని.. ప‌రిశ్ర‌మ పెద్ద‌లు సిఎం చంద్ర‌బాబును క‌లవాల‌ని అన‌డంతో త‌ప్పులేద‌న్నారు. ఈ విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించ‌వ‌ద్ద‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌భుత్వం తండ్రి లాంటిద‌ని.. వారు కూడా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించడానికి సినీ ప‌రిశ్ర‌మ‌ను మ‌రోసారి పిలిస్తే బావుండేద‌ని నారాయ‌ణ‌మూర్తి అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌భుత్వంను సినీ పెద్ద‌లు క‌ల‌వాల‌ని ఎపి డిప్యూటి సిఎం డిప్యూటి ప‌వ‌న్ క‌ల్యాణ్ అన‌డంలో త‌ప్పులేద‌న్న ఆయ‌న‌.. ప‌వ‌న్ సినిమా ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ ప్ర‌స్తావ‌న లేకుండా సినీ ప‌రిశ్ర‌మ‌లోని స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిద్దాం రావాల‌ని పిలిస్తే ప‌వ‌న్‌పై గౌర‌వం మ‌రింత పెరిగేద‌న్నారు.
నేటి రోజుల్లో సింగిల్ థియేట‌ర్ల మ‌నుగ‌డ ప్ర‌శ్నార్ధ‌క‌మైంద‌ని.. ప్ర‌స్తుత రోజుల్లో సింగిల్ థియేట‌ర్లు క‌ల్యాణ మండ‌పాలవుతున్నాయ‌న్నారు. వ‌ర్సంటేజిని బ‌తికించి నిర్మాత‌ల‌ను కాపాడాల‌న్నారు. ప్రేక్ష‌కులు ఒటిటిలో సినిమాలు చూస్తే ఇండ‌స్ట్రీ నాశ‌న‌మ‌వుతుంద‌న్నారు. ఎంతో మంది ఛాంబ‌ర్ ప్రెసిడెంట్‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసినా స‌మ‌స్య ప‌రిష్కారం కాలేద‌ని తెలిపారు.

సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపు విష‌యంపై అయ‌న మండి ప‌డ్డారు. భారీ ఖ‌ర్చుతో సినిమాలు తీయ‌డం స‌బ‌బే అయినా.. ఆ ఖ‌ర్చుల‌ను ప్ర‌జ‌ల‌పై రుద్ద‌వ‌ద్ద‌న్నారు. సినిమా బాగుంటే జ‌నాలు వ‌స్తార‌ని.. టికెట్ ధ‌ర‌లు పెంచ‌డం వ‌ల‌నే అభిమానులు త‌మ అభిమాన హీరోల సినిమాలు చూడ‌టం లేద‌ని.. వినోదం ఖ‌రీదుగా మారింద‌ని.. దీంతో ప్రేక్ష‌కులు , సినీ ప‌రిశ్ర‌మ న‌ష్ట‌పోతుంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.