వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి రథయాత్ర

మండపేట (CLiC2NEWS): మండపేట మండలంలోని ఇప్పనపాడు గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి రథయాత్ర ఎంతో వైభవోపేతంగా సాగింది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా మంగళవారం స్వామి వారిరథయాత్ర ఇప్పనపాడు చేరింది. గ్రామంలోని బొమ్మల రామాలయం వద్ద ప్రచార రథం బృందంచే అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. గ్రామంలో మహిళలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి కోలాట నృత్యాలతో సందడి చేశారు. పెద్దఎత్తున మహిళలు పాల్గొని స్వామివారికి హారతులు ఇచ్చి భక్తి ప్రవత్తులు చాటారు. అనంతరం ధర్మ ప్రచార కర్తలు భారతదేశ సంస్కృతి సంప్రదాయాల గురించి భక్తులకు హితోపదేశం చేశారు. ప్రతి స్త్రీ పురుషుడు నుదుటన బొట్టు సాంప్రదాయమైన వస్త్రధారణ మన హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాలలో భాగం అన్నారు. మహిళలు హిందూ సాంప్రదాయ పద్దతులను అవలంభించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని వివరించారు. స్త్రీలు పురుషులు గ్రామాన్ని పసుపునీటితో గోవింద నామస్మరణతో శుద్ధి చేశారు. తిరుపతి నుండి తీసుకొచ్చిన గోవింద నామాలు కుంకుమ అక్షతలు స్వామివారు ఫొటోస్ ప్రతి ఇంటికి అందజేశారు. గ్రామ సర్పంచ్ కుంచె వీరమణి ప్రసాద్ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం విశేషం.