Mandapeta: ద్వారపూడి రోడ్డుకు మరమ్మతులు

మండపేట (CLiC2NEWS): ఎట్టకేలకు ద్వారపూడి మండపేట రహదారికి యంత్రాంగం మరమ్మతులు చేపట్టింది. మండపేట నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఎక్కడ చూసినా వర్షాలకు చెరువులను తలపిస్తున్నాయి. గత రెండేళ్లుగా ఇదే దుస్థితి. ప్రజలు గత్యంతరం లేక ఆ రోడ్డు లోనే ప్రయాణాలు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాల వారు ద్వారపూడి గుండా మండపేట రావాలి అంటే బెంబేలెత్తి పోతున్నారు. అసలే కరోనాతో ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకున్నామని మళ్లీ ద్వారపూడి రోడ్డులో ప్రయాణించి రెండో సారి ఆసుపత్రులు పాలవలేమని ఎంతటి ముఖ్యమైన పనినైనా వాయిదా వేసుకుని విరమించుకుంటున్నారు. అంతేగాక రోడ్ల దారుణ పరిస్థితులపై టీడీపీ, బీజేపీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ చెరువులుగా మారిన ద్వారపూడి రోడ్డులో టీడీపీ శ్రేణులు ధర్నాలు సైతం చేపట్టారు. నిధులున్నా రోడ్డు నిర్మాణం ఆరంభించక పోవడం ఎంత దారుణం అంటూ రోడ్ల విషయంలో ప్రభుత్వం చోద్యం చూస్తుందని వైసీపీ వైఫల్యాలను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రజా క్షేత్రంలో ఎత్తి చూపారు.
(తప్పకచదవండి: ద్వారపూడి-మండపేట రహదారి మరమ్మతులకు జాయింట్ కలెక్టర్ హామీ..)
అదే విధంగా బీజేపీ తరపున జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ కూడా సబ్ కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులకు వినతి పత్రాల ద్వారా తెలియజేశారు. సోషల్ మీడియా గ్రూపుల్లో అయితే నెటిజన్లు దుమ్మెత్తి పోసిన విషయం విధితమే. మండపేటలో సామాజిక ఉద్యమ కారుడు బీ ఎన్ ఎస్ ఎన్ మూర్తి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్ని పరిణామాల నేపథ్యంలో అధికారులు నిద్ర లేచారో ఏమో ఎట్టకేలకు తూతూమంత్రం పనులకు ఉపక్రమించారు. దీంతో ఆర్ అండ్ బి అధికారులు రోడ్డులో ఏర్పడ్డ భారీ గోతులను పూడ్చే పనిలో పడ్డారు.