వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల తక్షణ సాయం: కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల కారణంగా ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకొన్నారు. ఈ నేపథ్యంలో వరద బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.10 వేల ఆర్ధికసాయం, 20 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు.
వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ భద్రాచలంలో వంతెన పైనుండి గోదావరి ఉద్ధృతిని పరిశీలించారు. భారీ వర్షాల దృష్ట్యా నెలాఖరు వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కెసిఆర్ అన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు, అధికారులతో సిఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సింగరేణి, ప్రభుత్వం కలిపి రూ. వెయ్యికోట్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. గోదావరికి 90 అడుగుల వరద వచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు. వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం జరగాలని సిఎం అభిప్రాయపడ్డారు.