పొదుపు పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి..

రాజమండ్రి పోస్టల్ సూపరింటెండెంట్ కెవివి సత్యనారాయణ..

బిక్కవోలు రూరల్ (CLiC2NEWS): తపాలా శాఖలోని పొదుపు పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని రాజమండ్రి డివిజినల్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.వి.సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కొంకుదురు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో సుకన్య సమృద్ధి యోజన పథకం బాలిక పక్షోత్సవాల ముగింపు సభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సభకు బ్రాంచ్ పోస్టుమాస్టర్ వై స్పర్జన్ రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో ఒక్క రోజులోనే 72 అకౌంట్లు ప్రారంభించిన బ్రాంచ్ పోస్టుమాస్టర్ స్పర్జన్ రాజును ప్రోత్సహించిన సబ్ డివిజినల్ అధికారి ఎం లక్ష్మణ్ కుమార్ ను ఆయన అభినందించారు. తపాలాశాఖలోని ఐపీబీపి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రామీణ తపాలా జీవిత బీమా పొదుపు పథకాలను వివరించారు.

రామచంద్రపురం పోస్టల్ ఇన్స్పెక్టర్ ఎం లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అధిక వడ్డీనిచ్చే తపాలాశాఖ పొదుపు పథకాలను అందరూ ప్రోత్సహించాలని కోరారు. సబ్ డివిజన్ అభివృద్ధికి తపాలా ఉద్యోగులు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చక్కటి ప్రతిభ ప్రదర్శించిన స్పర్జన్ రాజు కృషిని ప్రశంసించారు.

కొంకుదురు గ్రామ సర్పంచ్ సత్తి వీరమణి తన ప్రసంగంలో పోస్టాఫీసు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పొదుపు పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించి తపాలా శాఖ అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్ పర్సన్ సత్తి నాగిరెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థులు చింతా శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి అమ్మిరెడ్డి, పడాల వీర వెంకట సత్యనారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, గండ్రోతు రామకృష్ణ, గ్రామ పెద్దబాబి, రాయవరం, రామవరం, కొమరిపాలెం, వీ సావరం, వెదురుపాక, సింగంపల్లి, రంగాపురం బ్రాంచ్ పోస్టుమాస్టర్ లు, తపాలా సిబ్బంది, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.