మండపేటలో సావిత్రీ బాయ్ పూలే జయంతి వేడుక‌లు

మండపేట (CLiC2NEWS):  అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో అక్షరజ్యోతిని వెలిగించిన మహనీయురాలు సావిత్రీ బాయ్ పూలే అని ఏపీ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కోన సత్యనారాయణ పేర్కొన్నారు. సంఘ సంస్కర్త, ఉపాధ్యాయురాలు, రచయిత్రి సావిత్రిబాయి పూలే 191వ జయంతి వేడుకలను బీసీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉషాక్లినిక్ వద్ద బీసీ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కోన మాట్లాడుతూ నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వనిత సావిత్రీ బాయ్ పూలే అన్నారు. జ్యోతిరావు పూలే భార్యగా ఆమె కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన ప్రేమ స్వరూపిణి అన్నారు. ఆధునిక విద్య ద్వారా స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని భావించి ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చి దిద్దిన చదువుల తల్లి అన్నారు. సమాజంలో కులతత్వం పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలా మంది పండిత మేధావులు అందరికీ కూడా ఆమె కేవలం పూలే భార్యగానే తెలుసునని అన్నారు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పీడిత ప్రజల విద్యాభివృద్ధికి కృషి చేసిన మహోన్నతురాలని అన్నారు. తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలేను సదా స్మరించుకోవడం అందరి బాధ్యతని కోన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు వీరమల్లు శ్రీనివాస్, నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మల్లువలస గణపతిరావు, బొత్సా నరసింహమూర్తి, చుక్కల అప్పారావు, జొన్నపల్లి శ్రీధర్, షేక్ లాలా, సుబ్బారావు, శ్రీనివాసు, బీసీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.