నిత్యావసర వస్తువులు ఎంఆర్‌పికి మించి విక్రయిస్తే కఠిన చర్యలు..
కిరాణా దుకాణాలలో విజిలెన్స్ అధికారులు సోదాలు..
మండపేట (CLiC2NEWS): మండపేట పట్టణంలో కిరాణా వ్యాపారులు ఎంఆర్‌పి కంటే ఎక్కువ రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఏజీ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. నిత్యావసర సరుకులు, వంట నూనెలు అధిక రేట్లకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు విజిలెన్స్, తూనికలు కొలతలు శాఖ అధికారులు పట్టణంలో దాడులు నిర్వహించారు. సోమవారం మండపేట విచ్చేసిన విజిలెన్స్ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి సోదాలు చేపట్టారు. సివిల్ సప్లైస్ అధికారిని పద్మను వెంట బెట్టుకుని కేపీ రోడ్డు, టౌన్ హాల్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఉన్న హోల్ సేల్, రిటైల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. కేపీ రోడ్డులో ఉన్న బీఎన్ఆర్ వాల్ మార్ట్ తదితర కిరాణా దుకాణాల్లో విజిలెన్స్ ఏజీ లక్ష్మినారాయణ, తూనికలు కొలతలు శాఖ ఎస్సై సరోజిని, విజిలెన్స్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిలు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. స్టోర్ రూముల్లో ఉన్న పప్పు దినుసులు, నూనె నిల్వలను ఇతర సరుకులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు విజిలెన్స్ డీఎస్పీ సూచనలతో మండపేటలో సోదాలు చేపట్టామని తెలిపారు. పట్టణంలో హోల్ సేల్, రిటైల్ గా నిర్వహించే వ్యాపార సముదాయాల్లో వినియోగ దారులకు వస్తువులను ఏ విధంగా విక్రయిస్తున్నారో ఆరా తీశామన్నారు. ఏ వ్యాపారస్తుడైనా వినియోగదారులకు ఎమ్మార్పీ ధరకు మించి అమ్మకూడదని హెచ్చరించారు.