Mandapeta: విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేయవద్దు..
మండపేటలో విద్యుత్ ఉద్యోగుల నిరసన..

మండపేట (CLiC2NEWS): రాష్ట్రంలో విద్యుత్ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయవద్దని రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మండపేట పట్టణంలో ఉద్యోగులు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పురవీధుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ జీజే సుధాకర్ మాట్లాడుతూ న్యాయపరమైన తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నాలు రిలే నిరాహారదీక్షలు వర్కు టు రూల్ మొదలైన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డులను అధికారులకు సరెండర్ చేస్తున్నట్లు తెలిపారు. జేఏసీ కన్వీనర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ 24 డిమాండ్లను నెరవేర్చ వలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి జేఏసీ వినతి పత్రం ఇచ్చిందన్నారు. గత కొద్ది కాలంగా పెండింగ్ లో ఉన్న డిఏ లను వెంటనే మంజూరు చేయాలని కోరారు. అదే విధంగా పే రివిజన్ కమీషన్ పై కమిటీ వేయాలని అన్నారు. డివిజన్ చైర్మన్ వెర్రియ్య మాట్లాడుతూ సీపీఎస్ ను రద్దు చేసి పాత ఫెన్షన్ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ దాట్ల శ్రీధర్ వర్మ, ఏడిఈ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ నాయకుల విగ్రహాలకు వినతి
విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగులు మండపేట పట్టణంలో ఉన్న జాతీయ నాయకులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహాలకు పూల మాలలు వేసి వినతి పత్రాలు అందజేశారు.