భక్తి శ్రద్ధలతో చవితి వేడుకలు జరుపుకోవాలి
అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవు
మండపేట (CLiC2NEWS) : వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సహాలతో జరుపుకోవాలని రూరల్ సిఐ పి. దొరరాజు అన్నారు. అయితే, ఎవరికీ ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా శిక్షలు తప్పవని హెచ్చరించారు. మండపేట, ఇప్పనపాడులో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఆయన ఉత్సవ కమిటీ సభ్యులతో సిఐ సమావేశం నిర్వహించారు. మండపాల వద్ద కమిటీ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకునే వారు ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.
గణేశుడి విగ్రహాలను రోడ్లు, ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా ఏర్పాటు చేయాలని, మండపాల వద్ద అధిక శబ్ద కాలుష్యాన్ని కలిగించే స్పీకర్లను వినియోగించరాదని సూచించారు. వినాయక నిమజ్జనం సమయాలను, రూట్ మ్యాప్‌ను ముందుగానే పోలీసులకు తెలియజేయాలని, ఊరేగింపుల్లో డీజే బాక్సులు, బాణసంచా వాడరాదని, అలాగే అశ్లీల డాన్సులు, బృహన్నల డాన్సులు జరగకుండా చూడాలని ఆయన హెచ్చరించారు. ఉత్సవ మండపాలలో తాత్కాలికంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విగ్రహాల ఎత్తు ఐదు అడుగులకు మించకుండా ఉండేలా చూడాలన్నారు. విద్యుత్ అలంకరణల విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. సమావేశంలో మండపేట రూరల్ ఎస్సై కిషోర్, ఉత్సవ కమిటీల నిర్వాహకులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.