మితిమీరిన వేగం ముగ్గురు చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది

మండపేట (CLiC2NEWS):  స్కూల్ విద్యార్థుల‌తో వ‌స్తున్న ఆటో బోల్తాప‌డి చిన్నారులకు గాయాల‌య్యాయి. మండపేట పట్టణంలో కొంతమంది ఆటో వాలాలు ఇష్టా రాజ్యంగా డ్రైవింగ్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎదురుగా వచ్చే వారికి గాని పక్క నుంచి వెళ్లే వారికి గాని తగిలేది తప్పేది చూడకుండా ఆటో డ్రైవింగ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని ప్రయాణికుల నుండి ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతి వేగంతో ఆటోలు నడిపి ప్రమాదాలకు కారకులవుతున్నారని గగ్గోలు తున్నారు. మెయిన్ రోడ్డు కపిలేశ్వరపురం రోడ్డు ఏడిద రోడ్డు తదితర ప్రధాన కూడళ్ళలో ఆటోలు అడ్డంగా పెట్టి ప్రశ్నించిన వారి మీద వాగ్వాదానికి దిగుతున్నారని చెబుతున్నారు. మా ఇష్టం వచ్చినట్లు పెట్టుకుంటాం ఈ రోడ్డు ఏమైనా మీ బాబు గారి జాగీరా అని ఎదురు ప్రశ్నిస్తూ మూకుమ్మడిగా మీదపడిపోతుంటే చేసేది లేక మౌనం వహించాల్సి వస్తుందని వాహనదారులు ద్విచక్ర వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్దేశించిన జనాలకు మించి ప్రయాణికులను ఎక్కించుకుని ప్రమాదాల బారిన పడేయడమే కాకుండా జనం సంచరించే ప్రాంతాల్లో అతివేగంతో ఆటోలు డ్రైవ్ చేసి జనాలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే మండపేట గొల్లపుంత కాలనీ రోడ్డులో ఎదురైంది. ఓ ఆటోవాలా నిర్వాకానికి ముగ్గురు స్కూలు పిల్లలకు ప్రాణసంకటంగా మారింది. కన్ను లొట్ట పోయి చావు తప్పిన చందాన అదృష్ట వశాత్తూ పిల్లలు ప్రాణాలతో బయట పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. ధర్మగుండం చెరువు ప్రాంతంలో ఉన్న విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ లో చదివే విద్యార్థులను పాఠశాల అనంతరం యాజమాన్యాలు ఆటోలలో తమ తమ ఇళ్లకు పంపించారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ పిల్లల్ని ఎక్కించుకుని గొల్లపుంత కాలనీకి తీసుకెళ్ళాడు. ఆటో డ్రైవర్ మితి మీరిన వేగంతో వాహనం నడుపుతుండగా కాలనీకి వెళ్లే రహదారి మధ్యలో ఆటో హఠాత్తుగా తిరగబడి పోయిందని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు ఇరుక్కు పోగా వారిని స్థానికులు హుటాహుటిన సందిట్లో పెట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పి ఎల్ ప్రసన్న, దోమాడ వందన, కాకి మహిధర్ లకు తీవ్ర గాయాలు కాగా అందులో ఒక చిన్నారికి కాలు విరిగినట్టు తెలిసింది. సమాచారం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు, శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావులు, మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి, రెడ్డి రాధాకృష్ణ, వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరిలు హుటాహుటిన ఆసుపత్రికి పరుగులు తీశారు. గాయాలతో బోరున ఏడుస్తున్న పిల్లలను దగ్గరకు తీసుకుని ఏం కాదమ్మా మేమంతా ఉన్నాంగా అంటూ పిల్లల కన్నీరు తుడిచి తల్లి దండ్రులకు భరోసా ఇచ్చారు. పిల్లలకు మెరుగైన వైద్యం చేసి త్వరగా కోలుకునేలా చూడాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రభుత్వ వైద్యులను ఆదేశించారు. అందులో ఒకరి కాలికి పెద్ద గాయమై శస్త్ర చికిత్స అవసరమవుతుందని వైద్యులు సూచించారు. చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా తోట త్రిమూర్తులు రూ 5 వేలు అందజేశారు. ఇందుకోసం డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి తో మాట్లాడి చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయనను కోరారు. ఈ పరామర్శలో మున్సిపల్ కౌన్సిలర్ లు, వైఎస్సార్సీపీ నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.