మంజూరు చేసిన కాల‌నీల‌లో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలి..

లక్షా ఎనభై వేలతో ఇళ్ల నిర్మాణం అసాధ్యం: ఎమ్మెల్యే వేగుళ్ళ

మండపేట (CLiC2NEWS): వేములపల్లిలో మంజూరు చేసిన కాలనీలో ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. రామచంద్రపురంలో డివిజన్ అధికారులతో ఏర్పాటైన ఆర్డీవో సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశానికి  బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇళ్ళ స్ధలాల నిర్మాణంపై ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ వేములపల్లిలో ఇళ్లు నిర్మించాలని లేకపోతే స్థలం వెనక్కి తీసుకుంటామని అధికారులు, వలంటీర్లు బెదిరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లబ్దిదారులకు అవసరాలు తీర్చి ప్రోత్సహించాలే గానీ బెదిరింపులకు పాల్పడటం సరైన విధానం కాదన్నారు.

ప్రభుత్వం ఇచ్చే లక్షా 80 వేల రూపాయలతో ఇళ్ళు నిర్మాణం ఆసాధ్యం అన్నారు. దీనికి అదనంగా లబ్దిదారునికి మరో 3 లక్షలు భారం పడుతుందన్నారు.  మూడు లక్షలు లేకుండా ఇళ్ళు నిర్మాణం ప్రారంభిస్తే మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. అదనపు భారం వల్ల లబ్దిదారులు ఇళ్ళు  నిర్మించుకోవడానికి చొరవ చూపడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కాకినాడలో ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రభుత్వమే ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరారు. మండపేట వాసులకు ద్వారపూడిలో స్ధలం ఇవ్వడం వల్ల శంఖుస్ధాపనలు అయితే చేశారు గానీ 12 మంది మాత్రమే బేస్ మెంట్ లు నిర్మించుకోగలిగారని చెప్పారు. ఆ నిర్మాణాలు కూడా ఓ గుత్తేదారుని చేత బలవంతంగా నిర్మించినవేనని తెలియజేశారు.

ఇళ్ళ నిర్మాణానికి అవసరమయ్యే ముడిసరుకు ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. మండపేట పట్టణంలో ఇళ్ళు కట్టుకుంటే గత ప్రభుత్వంలో 2 లక్షల 50 వేలు హౌసింగ్ లోన్ ఇచ్చే వారమని తెలిపారు. ఇప్పుడు మండపేటలో కాకుండా ద్వారపూడిలో స్ధలాలు ఇచ్చి చాలీచాలని 1 లక్ష 80 వేల ఋణంతో కట్టుకోమనడం భావ్యం కాదని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకువెళ్ళారు. లేఅవుట్ కాకుండా సొంత స్ధలం ఉన్నవారికి కూడా హౌస్సింగ్ ఫ్రీ గ్రాంటు మంజూరు చేయాలన్నారు. రాయవరం మండలంలో 1126 మంది లబ్దిదారులకు, కపిలేశ్వరపురం మండలం, అద్దంకివారిలంక గ్రామంలో 131 మంది లబ్దిదారులకు అసలు స్ధలాలే అప్పగించలేదని వారికి కూడా ఆయా గ్రామాలలోనే వెంటనే స్ధలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినన ద్వారపూడి, వెలగతోడు లేఅవుట్ లను పట్టించుకోవడం మానేశారని అన్నారు. ద్వారపూడిలో నిర్మించుకున్న వారికి చాలా మందికి ఇంకా పేమెంట్ రాలేదన్నారు. సదరు సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా కొంతమంది లబ్దిదారులకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వలేదని కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామం, రాయవరం మండలం మాచవరం గ్రామాలలో అర్హులైన చాలా మందికి ఇళ్ళ స్ధలం రాలేదని తనకు ఫిర్యాదులు అందాయన్నారు. వారికి కూడా వెంటనే ఇళ్ళ స్ధలాలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ను కోరడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో హౌస్సింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, గృహ నిర్మాణ సంస్ధ సంచాలకులు జీవీ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.