Mandapeta: శెట్టిబలిజ రామాలయం వద్ద ఘనంగా శ్రీనివాసుని కల్యాణం
మండపేట (CLiC2NEWS): పట్టణంలోని శెట్టిబలిజ రామాలయం వద్ద శ్రీనివాసుని కల్యాణం ఘనంగా నిర్వహిస్తున్నట్లు శెట్టిబలిజ సంఘం నాయకులు పిల్లి గనేశ్వరరావు, కుక్కల రామారావు, యాండ్ర ప్రభాకరరావు, పెంకే గంగాధర్ లు తెలిపారు. శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ కోదండరామ శ్రీ అభయ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద శనివారం తెల్లవారు జాము నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భగా వేద పండితులు మాట్లాడుతూ రాజమండ్రిలో ఉన్న శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి( ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా సంస్థ ), శ్రీ కోదండరామ శ్రీ అభయ వేంకటేశ్వరస్వామి ఆలయం కమిటీ సభ్యుల నేతృత్వంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో గుండె గుండెకు గోవిందుడు గుడిసె గుడిసెకు గోవిందుడు అన్న సమతా సందేశంతో హిందూ ధర్మ ప్రచారం నిమిత్తం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా లోక కళ్యాణం కోసం లోక క్షేమం కోసం సంకల్పించి ఈ పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టడం జరిగింది అన్నారు. ఉదయం నుంచి స్వామి వారి శ్రీ భూ సమేత శ్రీ సౌలభ్య శ్రీనివాస స్వామి వారికి ప్రధమ ఆరాధనలు చేయడం జరిగిందన్నారు. ఆరాధనలో భాగంగా స్వామివారికి తిరుప్పాలయోచ్చి, తిరుప్పావై వంటి ద్రావిడ వేదాన్ని విన్నవించి భక్తులకు తీర్ధ ఘోష చేయడం జరిగిందన్నారు. అనంతరం సుదర్శన లక్ష్మీ నరసింహ స్వామి హోమం నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా విశ్వక్సేన ఆరాధన పుణ్య అవచనము, సకల దేవతా ఆరాధన, మండపారాధనలు పూర్తి చేస్తామన్నారు. సకల శుద్ధి కొరకు పుణ్య అవచన, కలశంలో లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తి చేశామని అన్నారు. తర్వాత అగ్ని ప్రతిష్ట సుదర్శన హోమం జరిపి పూర్ణాహుతి ఉంటుందన్నారు. సాయంత్రం కల్యాణ మహోత్సవం వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. భక్తులకు ప్రసాదం, కంకణ వితరణలతో తిరుమల నుంచి ప్రత్యేకంగా తీసుకు వచ్చిన తలంబ్రాలను భక్తులందరికీ పంచడం జరుగుతుంది అన్నారు. ఈ కల్యాణానికి భక్తులందరూ హాజరై తరించి స్వామి వారి దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.