Mandapeta: ప్రాథ‌మిక వైద్యుల సేవ‌లు మ‌రువ‌లేనివి

పీఎంపీ సమావేశంలో చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి..

మండపేట (CLiC2NEWS): కరోనా సమయంలో ప్రజలకు ఎన్నో సేవలు చేశారని ఇప్పుడు వైరస్ మూడవ దశలోకి ప్రవేశించిందని ప్రాథమిక వైద్యులు మరింత అప్రమత్తంగా ఉంటూ నియోజకవర్గ ప్రజలందరికీ తమ విలువైన వైద్య సేవలు అందించాలని మండపేట మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి కోరారు. ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మండపేట ఆలమూరు శాఖల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాథమిక వైద్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని టౌన్ హాల్ లో జరిగిన పీఎంపీల సదస్సుకు మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాణి మాట్లాడుతూ పీఎంపీ అసోసియేషన్ కు అవసరమైన భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని అని అసోసియేషన్ నాయకులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహకారంతో పీఎంపీల కోరిక తీరుస్తాననిఅన్నారు. గొల్లపుంత కాలనీలో ఉన్న స్థలంలోనే భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేసేలా తాను ప్రయత్నిస్తానని చెప్పారు.

అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంగుమళ్ల రాంబాబు, కోన సత్యనారాయణలు మాట్లాడుతూ మండపేట లో గతంలో అసోసియేషన్ భవనానికి స్థలం కేటాయించారని అలాగే రూ 15 లక్షలు నిధులు మంజూరు చేశారని అయితే ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల కాలేదన్నారు. తమ విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని భవనం నిర్మించాలని వారు కోరగా చైర్ పర్సన్ రాణి సానుకూలంగా స్పందించారు. అలాగే గ్రామీణ ప్రాథమిక వైద్యులు తమ తమ పరిధిలో వైద్యం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చిన రోగులకు వైద్యం అందిస్తూనే వైరస్ ను దృష్టిలో పెట్టుకొని పీఎంపీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది అన్నారు. పీఎంపీలు అనేక మంది మహమ్మారికి బలై పోయారని అన్నారు. ఇటీవల మరణించిన చిట్టూరి సత్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలని కాసేపు మౌనం పాటించారు. ఆయన కుటుంబానికి అసోసియేషన్ తరపున ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి తొలి సాయంగా గంగుమళ్ళ రాంబాబు రూ 5వేలు ప్రకటించారు. చైర్మన్ రాణిని అసోసియేషన్ సభ్యులు పూలమాలలువేసి దుస్సాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం పీఎంపీగా గత 40 ఏళ్లుగా ప్రాథమిక వైద్యం చేస్తూ అటు రాజకీయాల్లోనూ ఇటు బీసీ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగిన కోన సత్యనారాయణకు యాదవ సెల్ జాతీయ అధ్యక్షుడి పదవి వచ్చిన సందర్భంగా అసోసియేషన్ నాయకులు చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రాణి పూల మాలలు వేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పి.ఎం.పి అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బళ్ళా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జె వి వి సూర్యనారాయణ, మండల కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బళ్ళావెంకటరమణ, కోశాధికారి వానపల్లి కనకరాజు, సంయుక్త కార్యదర్శి యేడిద లక్ష్మణాచార్యులు, పుత్సల కాశీ, ఇందన వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, సుంకర బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.