రైతు భరోసా కేంద్రాల పనుల్లో వేగం పెంచాలి
అధికారులను ఆదేశించిన తోట త్రిమూర్తులు
మండపేట (CLiC2NEWS) : నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ సెంటర్ లు, సచివాలయ భవనాల నిర్మాణ పనులలో వేగం పెంచాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధికారులను ఆదేశించారు. బుధవారం వైసీపీ కార్యాలయంలో పంచాయతీ రాజ్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో నిర్మాణ దశలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అసంపూర్తిగా రైతు భరోసా కేంద్రాలను సంపూర్ణం చేయాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో ఉన్న భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయటానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ శాఖ చేస్తున్న వివిధ పనులకు సంబంధించి వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. బల్క్ మిల్క్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణాలను కూడా వెంటనే అప్పగించాలని కోరారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ రాజమహేంద్రవరం పంచాయతీ రాజ్ ఈఈ ఏబి వరప్రసాద్, ఇన్ చార్జి డిఈ రామనారాయణ, కపిలేశ్వరపురం ఏఈ రాఘవులు, మండపేట ఏఈ నాగేశ్వరరావులు పాల్గొన్నారు.