Mandapeta: కౌన్సిల్ సాధారణ సమావేశంలో వాడీ వేడి చర్చ
మండపేట (CLiC2NEWS): మండపేట కౌన్సిల్ సమావేశంలో టిడ్కో ఇళ్ల స్వాధీనం పై ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అసంపూర్తి నిర్మాణాలు పూర్తి చేయాలని టీడీపీ కౌన్సిలర్ లు విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ పై మున్సిపాలిటీ తీసుకున్న చర్యలు వివరించాలని కోరారు. కౌన్సిల్ సాధారణ సమావేశంలో పలు అంశాలపై వాడీ వేడి చర్చ జరిగింది.
షాదీఖానా నిర్మాణం చేపట్టాలి..
చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం జరిగింది. ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొని కౌన్సిల్ కు పలు సూచనలు చేశారు. టీడీపీ కౌన్సిలర్ కాశిన కాశీ విశ్వనాథం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 26 వ వార్డులో షాదీఖానా నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేశారన్నారు. ఆ నిర్మాణం అసంతృప్తిగా నిలిచి పోయిందన్నారు. గతంలో మున్సిపాలిటీ 27 లక్షలు మంజూరు చేసిందన్నారు. ప్రత్యేక అధికారి పాలనలో ఆనిధులు రద్దు చేశారని తెలిపారు. అసంపూర్తిగా మిగిలిపోయిన షాదీఖాన భవనంలో అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఇటీవల అగ్ని ప్రమాదం కూడా జరిగిందని కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. ప్రస్తుత కౌన్సిల్ పెరిగిన అంచనాలు రూపొందించి షాదీఖానా నిర్మాణం చేపట్టాలని కోరారు. ఎస్ జి ఎఫ్ నిధులతో నాగవంశీయులు వెలమ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. పాటిమీద కళ్యాణ మండపం పనులు కూడా పూర్తి చేయాలని కోరారు. దీనిపై చైర్ పర్సన్ రాణి స్పందించారు. తాము షాదీఖానా వద్దకు వెళ్లి పరిశీలించామన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసేందుకు అంచనాలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
టీడీపీ కౌన్సిలర్ కాళ్లకూరి స్వరాజ్య లక్ష్మి భవాని మాట్లాడుతూ గొల్లపుంత టిడ్కో ఇళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియజేయాలని నిలదీశారు. వార్డుల్లో ప్రజలు ఇదే అంశం తమను నిలదీస్తున్నారని ఆమె కౌన్సిల్ దృష్టిలో పెట్టారు. అపార్టుమెంట్లలో మొక్కలు మొలిచి శిథిలావస్థను తలపిస్తున్నాయన్నారు. లక్షలు అప్పు చేసి ఇళ్లకు డీడీలు చెల్లించారని, వాటి వడ్డీలు కట్టలేక లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చైర్ పర్సన్ రాణి మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసినప్పటికీ ఆ సమయంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వైయస్సార్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ కౌన్సిలర్ వైకాపా కౌన్సిలర్ ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రతి పేదవాడికి ఇల్లు తమ హయాంలో ఇచ్చి తీరుతామని ఈ సందర్భంగా చైర్పర్సన్ స్పష్టత ఇచ్చారు.
మందపల్లి రవికుమార్ మాట్లాడుతూ అక్కడ మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదన్నారు. ఈ ఇళ్ల నిర్మాణ విషయంలో టీడీపీ కౌన్సిలర్ లు ఎమ్మెల్యే వేగుళ్ళ ను ప్రశ్నించాలని టీడీపీ కౌన్సిలర్లకు బదులిచ్చారు. ఆయన ఏమి చేసారో అడగాలన్నారు. కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు, మరికొన్ని నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. డ్రైన్ కనెక్టివిటీ చేయాల్సి ఉందన్నారు. మరుగుదొడ్లు మౌలిక సదుపాయాలు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ప్రస్తుతానికి బ్యాంకు లింకేజీ రుణాల ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని కేవలం మరుగుదొడ్లు ట్యాంక్ లు పూర్తి కావాల్సి ఉందన్నారు. రెండున్నరేళ్లుగా అక్కడ ఒక్క పని కూడా జరగలేదన్నారు. ఏది శాశ్వతం కాదని ప్రభుత్వంలో ఎవరున్నా అభివృద్ధి నిరంతర ప్రక్రియగా సాగుతుందన్నారు. వ్యక్తులు శాశ్వతం కాదని వ్యవస్థ శాశ్వతమని అన్నారు. కమిషనర్ రామ్ కుమార్ మాట్లాడుతూ రూ 19.04 కోట్లు మొదటి విడత అపార్టుమెంట్లు పనులకు మౌలిక సదుపాయాల నిమిత్తం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి టెండర్లకు పిలిచినట్లు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వేములపల్లి లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఒత్తిడి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో గొల్లపుంత లో ఇళ్ల స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకోవాలని ఒత్తిడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఇళ్ల స్థలాలు అమ్మేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు. అదే పరిస్థితి వేములపల్లి కాలనీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇక మూడో ఆఫ్షన్ గా ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు తెలిసిందన్నారు. లబ్ధిదారులపై ఒత్తిడి పెంచవద్దని ప్రజల నుండి వినబడుతున్న మాటలను దృష్టిలో ఉంచుకుని చెబుతున్నానని అన్నారు.
టీడీపీ కౌన్సిలర్ యరమాటి గంగరాజు మాట్లాడుతూ పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. దీనిపై పోతంశెట్టి ప్రసాద్ స్పందిస్తూ తెల్లవారుజామున పారిశుధ్య కార్మికులపై కూడా కుక్కలు విరుచుకు పడుతున్నాయని ఆయనకు ఊతమిచ్చారు.
డెంగ్యూ సోకి పట్టణంలో ఇద్దరు మృతి చెందారని దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఆరవ వార్డు కౌన్సిలర్ కాశిన కాశీవిశ్వనాథం, 17వ వార్డు కౌన్సిలర్ కాళ్ళకూరి స్వరాజ్య భవానీలు ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ వివరణ ఇచ్చారు. డెంగ్యూ అనేది పారిశుధ్యం వల్ల రాదని అన్నారు. వర్షపు నీటి నిల్వల వల్ల, పెరట్లలో ఉండే నీటి నిల్వల వల్ల డెంగ్యూ వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ నీటిలోనే డెంగ్యూ దోమ గుడ్లు ఉత్పత్తి ఎక్కువగా చేస్తుంది అన్నారు. అందుచేత ప్రతి ఇంటి పరిసరాల్లో వ్యర్థ జలాలు లేకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మండపేటలో వాటర్ ప్లాంట్ లు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయని కాశిన కాశి పేర్కొన్నారు. కాగా అవి సురక్షితమేనా అంటూ కౌన్సిల్ లో ప్రశ్నించారు. చాలా మంది ఫ్యూర్ పై వాటర్ అంటూ టిన్నుల్లో తీసుకు వెళ్లి వినియోగిస్తున్నారని వీటి నాణ్యత పై కొన్ని అపోహలు ఉన్నాయని తెలిపారు. ఉదాహరణకు కౌన్సిల్ లో అందరికీ వాటర్ బాటిల్స్ సరఫరా చేసారని వాటిపై తయారీ తేదీ లేదని సీసా చూపించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ అన్ని ప్లాంట్ ల వద్ద నీటి నాణ్యతపై తనిఖీలు చేస్తామని చెప్పారు. సమావేశంలో వైస్ చైర్మన్ లు పిల్లి గనేశ్వరరావు, వేగుళ్ల నారాయణరావు (నారయ్యబాబు), కౌన్సిలర్ లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కాగా సమావేశం అనంతరం బయటకు వచ్చిన తర్వాత టీడీపీ కౌన్సిలర్ చుండ్రు సుబ్బారావు చౌదరి, వైస్ చైర్మన్ లు ఇద్దరూ వెళ్తూ వెళ్తూ మాటామంతీ జరిపారు. ఎమ్మెల్యే వేగుళ్ల వేములపల్లి ఇళ్ల నిర్మాణం విషయంలో ఆయన ఇచ్చిన సూచనలు ఆమోదయోగ్యమైనవిగా ఉన్నాయని సుబ్బారావుతో ఇద్దరు వైస్ చైర్మన్ లు మాట కలపడం విశేషం. కౌన్సిల్ లో ఒక పక్క ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలపై వైసీపీ కౌన్సిలర్ లు ఎక్కడా పొసగనివ్వకుండా ధీటుగా సమాధానమిస్తుంటే ఇద్దరు వైస్ చైర్మన్ లు ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఏకీభవిస్తూ సుబ్బారావు చౌదరితో మాట కలిపి సమర్ధించడం చర్చనీయాంశం అయింది.
Wow, fantastic blog layout! How long have you ever been blogging for? you made running a blog glance easy. The total look of your website is great, let alone the content material!!