Mandapeta: `చాంబర్ ఆఫ్ కామర్స్` భ‌వ‌న నిర్మాణానికి కృషి చేస్తా..

మండపేట (CLiC2NEWS): చాంబర్ ఆఫ్ కామర్స్ కు స్థల సేకరణతో పాటు భవన నిర్మాణానికి కృషి చేస్తానని నూతన అధ్యక్షునిగా ఎన్నికైన అఖిల భారత ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కాళ్లకూరి నాగబాబు పేర్కొన్నారు. రథం సెంటర్ లో ఉన్న మున్సిపల్ చైర్ పర్సన్ కార్యాయంలో గురువారం మీడియాతో నాగబాబు మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన చాంబర్ ఆఫ్ కామర్స్ కు తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న వర్తక, వాణిజ్య వ్యాపారస్తులకు అందరికీ ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు. గత ముప్పై సంవత్సరాలుగా మండపేట చాంబర్ ఆఫ్ కామర్స్ కు ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు. పట్టణంలో ఉండే వ్యాపారస్తులు అంతా ఒకరికి ఒకరు స్నేహ భావంతో మెలిగేవారేనని అలాంటి స్నేహితులతో ప్రయాణం చేయడానికి తనకు చాంబర్ ఆఫ్ కామర్స్ వేదికవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తాను ఇప్పటి వరకూ అఖిల భారత స్థాయిలో ఆర్యవైశ్య సంఘాలకు ప్రాతినిధ్యం వహించానని తొలిసారిగా చాంబర్ ఆఫ్ కామర్స్ కు అధ్యక్ష బాధ్యత చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో పురప్రముఖులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు తనను వెన్నుతట్టి ప్రోత్సహించారని అన్నారు. వర్తకులకు ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు. తన పదవీ కాలంలో చాంబర్ ను అభివృద్ధి చేసి జిల్లాల్లోనే ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు ఉపయోగపడే విధంగా ఒక మంచి భవనం నిర్మించడానికి తన శాయక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో చెన్నా రాంబాబు(రాంపండు), బోననగిరి వెంకన్న బాబు, మన్యం ప్రసాద్, గ్రంధి నమశ్శివాయ, సంకా భాస్కరప్రకాష్, బి రవి సత్యకుమార్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.