మూడో వన్డేలో టీమిండియా అద్భుత విజయం..
కోహ్లీ సేనకు తప్పిన క్లీన్‌స్వీప్

కాన్‌బెర్రా: కోహ్లీ సేన పరువు నిలుపుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఆసీస్‌పై 13 పరుగుల తేడాతో గెలుపొంది.. సిరీస్ వైట్‌వాష్ కాకుండా ఊపిరి పీల్చుకుంది. 303 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆస్ట్రేలియా 289 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ ఆరోన్ ఫించ్(75), మాక్స్‌వెల్(59) అర్ధ సెంచరీలతో రాణించారు, భారత్ బౌలర్లలో ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా,నటరాజన్ రెండేసి వికెట్లు.. కుల్దీప్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన 50 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 302 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(92) వీరోచిత ఇన్నింగ్స్‌తో అదరగొట్టగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(63), రవీంద్ర జడేజా(66) అర్ధ శతకాలతో భారీ స్కోర్ సాధించడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇక ఆసీస్ బౌలర్లలో అగర్ రెండు వికెట్లు పడగొట్టగా.. హాజెల్‌వుడ్, జాంపా, అబాట్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది.