ఒక్కరోజులో అమెరికాలో లక్ష కేసులు.. 3 వేలకుపైగా మరణాలు

వాషింగ్ట‌న్‌: అమెరికాను కరోనా భూతం సులభంగా వదిలేటేట్టు లేదు. భారత్ వంటి దేశాలు కరోనా వ్యాప్తి నుంచి అనూహ్యంగా బయటపడుతుండగా అమెరికాలో వైరస్ మళ్లీ తిరగబెట్టింది. తాజాగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో అమెరికాలో 3,157 కోవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 2 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 1,00,226 మంది ఆసుపత్రిపాలయ్యారు. రాబోయే తీవ్రమైన చలిరోజుల్లో దేశం మరింత గడ్డుపరిస్థితులను ఎదుర్కోక తప్పదని అమెరికా ప్రధాన వైద్యాధికారి హెచ్చరించారు.

ఈ సంవత్సరం ఏప్రిల్‌ 15తో పోల్చుకుంటే అమెరికాలో కోవిడ్‌ మరణాల సంఖ్య 20 శాతం పెరిగింది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు అమెరికాలో 2,80,581 మంది మరణించగా, 14 కోట్లమందికి పైగా కోవిడ్‌ సోకినట్టు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. కాగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా మరింత విజృంభించే ప్రమాదం ఉందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) డైరెక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్స్‌ హెచ్చరించారు.

నవంబర్ 10 నుంచి అమెరికాలో ఆసుపత్రుల్లో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది. దీంతో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోనున్నాయని అమెరికన్ మీడియా పేర్కొంది.
ఎక్కువ మంది ఒకచోట చేరకూడదని హెచ్చరిస్తున్నా వినకుండా, గత వారంలో జరిగిన థ్యాంక్స్‌ గివింగ్‌ లాంటి ఉత్సవాలను జరుపుకునేందుకు లక్షలాది మంది అమెరికన్లు ఒకచోటి నుంచి మరోచోటికి ప్రయాణించడం కూడా కోవిడ్‌ వ్యాప్తికి కారణమని భావిస్తున్నారు.

జాతి ప్రజారోగ్య చరిత్రలోనే అత్యంత కష్టకాలాన్ని అమెరికా ఎదుర్కోబోతోందని యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ హెచ్చరించారు. తక్కువ సంఖ్యలో పడకలు, మితిమీరి పనిచేస్తున్న వైద్య సిబ్బంది వల్ల దేశవ్యాప్తంగా ఆసుపత్రులపై భారం పెరిగిపోయిందని చెప్పారు. మరోవైపున దేశంలో 911 ఎమర్జెన్సీ కాల్ సిస్టమ్ కుప్పకూలే దశకు చేరుకుందని అమెరికన్ అంబులెన్స్ అసోసియేషన్ హెచ్చరించింది.
దేశ పశ్చిమ ప్రాంతంలో మూడో దశ ప్రవేశసిస్తున్న తరుణంలో అదనపు ఉపశమన చర్చలు చేపట్టకుంటే ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పగూలే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.