నా ఇంటికి ఎవరూ రావద్దు: సల్మాన్
ముంబయి: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రేపు 55వ వడిలోకి అడుగు పెట్టనున్నారు. ఆయన పుట్టిన రోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు అభిమానులు ఇప్పటికే రెడీ అయ్యారు. అయితే ఆయనతో ఒక్క ఫొటో దిగాలన్న కోరిక, నేరుగా విషెస్ చెప్పాలన్న ఆత్రంతో ప్రతి యేడు సల్మాన్ ఇంటి ముందు వందలాది మంది పోగయ్యేవారు.
ఈ నేపథ్యంలో అభిమానులెవరూ తన ఇంటికి రావద్దని ముందుగానే చెప్తున్నారు సల్లూభాయ్. ముంబైలో తను నివసించే గెలాక్సీ అపార్ట్మెంట్స్ ముందు జనాలెవరూ పోగవకండంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అపార్ట్మెంట్ గేటుకు ఓ నోటీసు అంటించారు.
“ప్రతి ఏటా నా పుట్టిన రోజున అభిమానులు నాపై ఎంతగానో ప్రేమాభిమానాలు కురిపించేవారు. కానీ ఈసారి కరోనా వైరస్ కాచుకుని కూర్చున్నందున దానిని దృష్టిలో ఉంచుకుని ఎవరూ ఇంటి ముందు గుమిగూడొద్దని కోరుతున్నాను. ప్రస్తుతానికి నేను అపార్ట్మెంట్లో కూడా లేను. మీరందరూ మాస్కు పెట్టుకోండి, సానిటైజర్ రాసుకోండి, భౌతిక దూరం పాటించండి” అని పోస్టర్లో రాసుకొచ్చారు.
