అమెరికాలో ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థి!

మంచిర్యాల (CLiC2NEWS ): ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా వెళ్లిన మంచిర్యాలకు చెందిన ల‌గిశెట్టి స్పంద‌న ప్ర‌మాద‌వ‌శాత్తు త‌ల‌కు గాయ‌మై ఆస్ప‌త్రిలో చికిత్స‌పొందుతోంది. త‌మ బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఆస్ప‌త్రిలో ఉన్న‌ద‌న్న విష‌యం తెలియ‌గానే త‌ల్లిదండ్రులు ఆవేద‌న చెందుతున్నారు. మంచిర్యాల ప‌రిధిలోని న‌స్పూర్ నాగార్జున కాల‌నీకి చెందిన ల‌గిశెట్టి శ్రీ‌నివాస్‌, సునీత దంప‌తుల పెద్ద కుమార్తె స్పంద‌న ఎంఎస్ చ‌ద‌వ‌డానికి చికాగో న‌గ‌రానికి వెళ్లారు. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఎల్మ‌ర్‌హార్ట్స్ యూనివ‌ర్సిటీలో ఆమె ఎంఎస్ సెకండ్ ఇయ‌ర్ చ‌దువుతోంది. క‌లేజ్ నుండి ఇంటికి చేరుకునే క్ర‌మంలో మెట్రో స్టేష‌న్ మెట్ల నుండి కింద‌కి ప‌డిపోవ‌డంతో ఆమె త‌ల‌కు, ప‌క్క‌టెముకుల‌కు ,వెన్నెముక‌కు గాయాలైన‌ట్లు స‌మాచారం. ఆమెకు ప్ర‌స్తుతం పార్క్ రిడ్జ్‌లోని అడ్వొకేట్ లూథ‌ర‌న్ జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిలో చికిత్స‌నందిస్తున్నారు. స్పంద‌న తండ్రి క్యాబ్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తూ త‌న ఇద్ద‌రు కుమార్తెల‌ను చ‌దివిస్తున్నాడు.

త‌మకు పాస్‌పోర్ట్‌, వీసా లేక‌పోవ‌డంతో త‌మ బిడ్డ‌ను చూసే అవ‌కాశం లేక‌పోవ‌డంతో స్పంద‌న త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. పాస్‌పోర్ట‌కు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నామ‌ని, వీసా కోసం ఎంత స‌మ‌యం ప‌డుతుందోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు. త‌మ పేద‌రికాన్ని దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వ ప‌రంగా స‌హాయం అందించాల‌ని క‌లెక్ట‌ర్ కుమార్ దీప‌క్‌ను శ్రీ‌నివాస్‌ వేడుకున్నాడు. అమెరికాలో ఉన్న తెలుగు వారు , దాత‌లు త‌మ బిడ్డ జీవితాన్ని కాపాడేందుకు తోడ్పాటు అందించాల‌ని స్పంద‌న త‌ల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.