పారిశుధ్య కార్మికుడి నిజాయితీ..
చెన్నై: చెత్తకుండిలో దొరికిన రూ.15వేల నగదును సొంతదారునికి అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఓ పారిశుధ్య కార్మికుడు. ఆ పారిశుద్ధ్యకార్మికుడిని నిజాయితీని పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులే కాకుండా పలువురు ప్రశంసిస్తున్నారు.
ఈ ఘటన చెన్నై అడయారు మండలం 181వ వార్డు కార్పొరేషన్ పారిశుధ్య కార్మికుడు ఎన్.మూర్తి (48). ఇతను బ్యాటరీ వాహనంలో చెత్తను సేకరిస్తుంటాడు. 3వ తేదీ శాంతినగర్ బీచ్‌రోడ్డులో చెత్తను సేకరిస్తుండగా ఓ పార్శిల్ కంటపడింది. దానిని విప్పి చూడగా అందులో రూ.15వేల నగదు ఉంది. వెంటనే మూర్తి కార్పొరేషన్ పారిశుధ్య విభాగం వార్డు మేనేజర్ సెల్వంకు విషయం తెలిపాడు. సెల్వంతో కలిసి ఆ నగదును పార్శిల్ పడివేసిన ఇంటి యజమానికి అప్పగించారు. విషయం తెలుసుకున్న కార్పొరేషన్ ఆరోగ్యశాఖ డిప్యూటీ కమిషనర్ దివ్యదర్శిని, ఉన్నతాధికారులు బుధవారం మూర్తిని పిలిపించి అభినందించి అతనికి రూ.5వేలు బహుమతిగా అందజేశారు. మైలాపూర్ నియోజకవర్గం శాసనసభ సభ్యులు నటరాజన్ గురువారం మూర్తిని అభినందించారు. ఈ ఘటనతో ఎన్.మూర్తి తమిళనాట వార్తల్లో నిలిచాడు.