హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం..
హైదరాబాద్ (CLiC2NEWS): హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ఉన్నతాధికారిగా ఉంటూ.. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదని సూచించింది. ఆయనను హైడ్రా కమిషనర్ పోస్టు నుండి తొలగించాలని సిఎస్‌ను ఆదేశించింది. ఆయన స్థానంలో ఐజి స్థాయి అధికారిని నియమించాలని సూచించింది.
దీనిపై పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తెలిపారు. అఫిడవిట్లో కమిషనర్ రంగనాథ్ క్షమాపణ కోరారు. కోర్టుల పట్ల నమ్మకముందని పేర్కొన్నారు. ఈ క్రమంలో రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలైయ్యాయని.. దీనికి కారణమేంటని అడ్వకేట్ జనరల్‌ని హైకోర్టు ప్రశ్నించింది.
ఒకే పిటిషన్‌కు సంబంధించి పలుమార్లు కోర్టు ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ ధిక్కరించడం నేరమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లోతుకుంట భూములకు సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైడ్రా ఉల్లంఘించిందని.. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో కోర్టుకు హైడ్రా కమిషనర్ హాజరుకావాలని ఆదేశించింది.