న్యాయవాదుల హత్యపై స్పందించిన హైకోర్టు
హైదరాబాద్ : న‌్యాయవాదులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణి దంపతుల హత్య కేసును హైకోర్టు సుమోటోగా పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు సిజె జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.ఈ హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు పకడ్బందీగా సేకరించాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ లోపు సమగ్రమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వానికి, పోలీసు శాఖకు నోటీసులు జారీ చేసింది. హత్య జరిగిన చోట అన్ని ఆధారాలను సేకరించి, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపాలని ఆదేశించింది. హత్య జరిగిన సమయంలో అక్కడున్న ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులను గుర్తించి.. వాళ్లను సాక్షులుగా చేర్చాలని కోర్టు తెలిపింది. హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని, వాటిని భద్రపరచాలని సూచించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని, ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. న్యాయవాదుల హత్య తీవ్ర గర్హనీయమన్న కోర్టు, ఈ ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొంది. సాక్ష్యులను పకడ్బందీగా స్వీకరించాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
న్యాయవాదులైన వామన్‌రావు, నాగమణి హత్య జరిగిన వెంటనే పోలీసు శాఖ అప్రమత్తమైందని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. హంతకులను అతి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన కోర్టుకు చెప్పారు.

న్యాయవాదుల హత్యకు నిరసనగా హైకోర్టు లాయర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ రోజు విచారణకు వచ్చే అన్ని కేసులను బహిష్కరిస్తున్నట్లు హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రకటించింది. అలాగే రంగారెడ్డి జిల్లా కోర్టులు, నాంపల్లి, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు, కూకట్‌పల్లి కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.