టీకా తీసుకున్న రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి మోడీతోపాటు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు వ్యాక్సిన్ తీసుకున్నారు. తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్లో టీకా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన వారికి ఉచిత కోవిడ్ టీకా పంపిణీ నిన్నటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, ఆయన సతీమణి కూడా మంగళవారం ఢిల్లీలోని హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్లో కోవిడ్ టీకా తీసుకున్నారు. టిఆర్ ఎస్ ఎంపి కే కేశవ రావు ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో ఆయన టీకా వేయించుకున్నారు. ఇక శ్రీనగర్లో జమ్మూకశ్మీర్ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫారూక్ అబ్దుల్లా షేర్ ఏ కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో ఆయన తొలి డోసు టీకా వేయించుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి దేశవ్యాప్తంగా ఉచిత టీకాలు నిన్నటి నుంచి ఇస్తున్న విషయం తెలిసిందే. 45 ఏళ్లు దాటి, వ్యాధులు ఉన్నవారు కూడా కోవిడ్ టీకాలను వేసుకోవచ్చు. అలాగే ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు వాక్సిన్ తీసుకున్నారు. తాజాగా ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్ రవిశాస్త్రి మంగళవారం ఉదయం కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే కోవిడ్ టీకా తీసుకోవాలనుకునేవారు.. కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటి వరకు కోవిన్ పోర్టల్లో 50 లక్షల రిజిస్ట్రేషన్లు అయినట్లు కోవిడ్ వ్యాక్సినేషన్ గ్రూపు చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు.