పోలీసుల అదుపులో మనోజ్ఞ భర్త
గుంటూరు: అనుమానాస్పద స్థితిలో శనివారం గుంటూరులోని లక్ష్మీపురంలో అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి మృతి చెందిన నర్రా మనోజ్ఞ (29), ఆమె కుమార్తె తులసి (9 నెలలు) కేసులో భర్త కల్యాణ్ చంద్ర, అత్తమామలు కామేశ్వరి, శ్రీమన్నారాయణలను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట 9 నెలల పాపను విసిరి… తర్వాత తాను దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన శనివారం గుంటూరులో జరిగిన విషయం తెలిసిందే. కాగా గుంటూరుకు చెందిన మనోజ్ఞ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తోంది. లాక్డౌన్ సమయంలో గుంటూరు వెళ్లిన మనోజ్ఞ అక్కడే ఉంటోంది. ఈ క్రమలో శనివారం తన తొమ్మిది నెలల పాపతో పాటు ఆత్మహత్య చేసుకుంది. మొదట ఐదంతస్తుల భవనం నుంచి పాపను నిర్ధాక్షిణ్యంగా కిందికి విసిరేసింది… ఆవెంటనే ఆమె కూడా దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా ఈ ఘటనలో పాప అక్కడిక్కడే మృతిచెందగా.. మనోజ్ఞ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.
(గుంటూరులో విషాదం.. 9 నెలల పాపతో సహా మహిళ ఆత్మహత్య)
కాగా భర్తే చంపేశాడంటూ మనోజ్ఞ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అత్తింటివారే తమ కుమార్తెను చంపారని మనోజ్ఞ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పట్టాభిపురం పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే అపార్ట్మెంట్ వాచ్మెన్, అక్కడ నివసించే కుటుంబాల నుంచి సమాచారం సేకరించారు. రెండు మృతదేహాలపై కనీసం రక్తం చుక్క కూడా లేకపోవడంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. శనివారం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య జరిగిన ఘటనకు సంబంధించి మధ్యాహ్నం వరకు పోలీసులకు సమాచారం అందించకపోవడంపై మనోజ్ఞ తల్లిదండ్రులు విజయలక్ష్మి, భాస్కరరావు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. వివాహం అయిన నాటి నుంచి మనోజ్ఞను ఆమె తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులపై భర్త, అత్తమామలు దెప్పిపొడుస్తూ ఉండేవారని విచారణలో వెల్లడైనట్లు సమాచారం. పుట్టింటికి కూడా వెళ్లనీయకుండా ఇబ్బందులకు గురి చేసేవారని మృతురాలి బంధువులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మనోజ్ఞ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న పలు ఆధారాలను సేకరిస్తున్నారు. మనోజ్ఞ, తులసిల మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసుల తెలిపారు.