TS: ఒక్క ఎకరం కూడా వదలకుండా సాగు: సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. కొత్తగా పారాబాయిల్డ్ మిల్లులు గణనీయంగా ఏర్పాటు చేయాలన్నారు. దీని కోసం అత్యంత క్రియాశాలకంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ఏడేండ్ల కాలంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన ఘన విజయాలను రెండో రోజు ఇవాళ (బుధవారం) జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చర్చించారు.
24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతో పాటు, అనేక కష్టాలకోర్చి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నదీజలాలను చెరువులకు, కుంటలకు, బీడు భూములకు ప్రభుత్వం మల్లించిందని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఒక్క ఎకరం కూడా వదలకుండా, వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను రైతులు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. దాంతో రాష్ట్రంలో పెద్దఎత్తున వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు.
సిఎం కెసిఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్లో జరిగిన కేబినెట్ భేటీలో వ్యవసాయ శాఖపై చర్చించారు. ఈ సందర్భంగా గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు కేబినెట్‌కు సమగ్రంగా వివరించారు. వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో, విత్తనాలు ఎరువుల లభ్యత, వర్షాపాతం తదితర అంశాల పై కేబినెట్ చర్చించింది.
రాష్ర్టంలోని రైతాంగానికి పంట పెట్టుబడి సాయం రైతు బంధు సహా సకాలంలో ఎరువులు, విత్తనాలను అందిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గత సంవత్సరం తెలంగాణలో రికార్డు స్థాయిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు.
తెలంగాణ రైతులు మరింత ఉత్సాహంతో వరిధాన్యాన్ని పండించే పరిస్థుతులు రాష్ట్రంలో నెలకొన్నాయని, వచ్చే సంవత్సరం ధాన్యం ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ధాన్యం నిలువ చేయడం, మార్కెటింగ్ చేయడం పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
రెండు శాఖల్లో ఖాళీలు ఉండకూడదు..
సందర్భానుసారంగా అవసరాలను గుర్తించి అధికారులు, నిపుణులు సంయుక్తంగా రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సిఎం ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ సహా వ్యవసాయశాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. పండిన ధాన్యాన్ని పండినట్టే ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మిల్లింగ్ చేసి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి సరఫరా చేయాలని ఆదేశించింది. ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. అందుకు అవసరమైతే సంబంధిత రంగంలో నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలని కేబినెట్ సూచించింది. నూతనంగా ముందుకు వచ్చే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని మంత్రి మండలి అధికారులను ఆదేశించింది.
ఆయిల్ ఫామ్ రైతులకు రాయితీ..
రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ పంట సాగు ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రానున్న 2022-23 సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్య పరిచి ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ఎకరాకు.. మొదటి సంవత్సరం రూ. 26 వేలు, తరువాతి రెండేళ్లు ఏటా రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి కింద రాయితీగా అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అటవీశాఖ అభివృద్ధి శాఖతోపాటు, పంచాయితీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా ఆయిల్ఫామ్ మొక్కల నర్సరీలు పెంచాలని కేబినెట్ సూచించింది.
కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగనున్ననేపథ్యంలో.. ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రి గంగుల కమలాకర్, హరీశ్ రావు, కెటిఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.