5 రోజుల్లో ఉద్యోగ ఖాళీలపై వివరాలివ్వండి

అధికారులకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆదేశం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల‌పై వివిధ శాఖ‌లు స‌మ‌ర్పించిన వివ‌రాలు అసంపూర్తిగా ఉన్నాయ‌ని మంత్రి మండ‌లి అభిప్రాయ‌ప‌డింది. అన్ని విభాగాల నుంచి అయిదు రోజుల్లోపూర్తి స‌మాచారాన్ని సేక‌రించి అంద‌జేయాల‌ని సూచించింది. కొత్త జోనల్‌ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగుల విభజన జరగాలని, జిల్లాలవారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయటానికి చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది.

ప్రగతిభవన్‌లో బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై లోతుగా చర్చించారు.
వివిధ ప్ర‌భుత్వ శాఖ‌లు త‌ప ప‌రిధిలో 56,979 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న‌ట్లు నివేదించాయి. ఇందులో 21,507 హోం శాఖ (పోలీసు), వైద్యారోగ్య‌శాఖలో 10,048, ఉన్న‌త విద్య‌లో 3,825, బిసి సంక్షేమ శాఖ‌లో3,538, మిగతా శాఖ‌ల్లో 1,000 కంటే త‌క్కువ ఖాళీలు ఉన్నాయి. కాగా ఐటి శాఖ‌లు నాలుగు ఉద్యోగాలు మాత్ర‌మే భ‌ర్తీ కావాల్సి ఉంది. ఈ వివ‌వ‌రాల‌న్నిబుధవారం నాటి మంత్రివర్గ సమావేశానికి హాజ‌రైన అన్ని శాఖల కార్యదర్శులు వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగులు, ఖాళీల వివరాలను క్యాబినెట్‌ ముందుంచారు. ప్రతి విభాగంలో మంజూరైన పోస్టుల సంఖ్య, వివిధ క్యాటగిరీల్లో ఉన్న ఖాళీల వివరాలు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వివరాలను అందించారు.

అధికారులు స‌మ‌ర్పించి వివరాల‌ను ప‌రిశీలించిన సిఎం కెసిఆర్‌, మంత్రులు పూర్తి వివ‌రాలు లేవ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. పెద్ద ఎత్తున ఖాళీలు చేప‌డుతున్నందున స‌మ‌గ్ర స‌మాచారం అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు.

ఎపిలో ప‌నిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్లో 500 మంది ఇప్ప‌టికే స్వ‌రాష్ట్రానికి వ‌చ్చార‌ని మ‌రో 200 నుంచి 300 తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రానుంచి తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఖాళీలు సహా, ఆంధ్రా నుంచి వచ్చే ఉద్యోగులందరినీ కలుపుకొని, మిగిలిన ఖాళీలను సత్వరమే గుర్తించి క్యాబినెట్‌ సబ్‌కమిటీకి నివేదిక అందించాలని అధికారులను మంత్రిమండలి ఆదేశించింది.

అలాగే ఒక‌వైపు నియామ‌క ప్ర‌క్రియ కొన‌సాగుతూనే.. మ‌రోవైపు కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ, కొత్త జిల్లాల ప్ర‌కారం ఉద్యోగుల విభ‌జ‌న జ‌ర‌గాల‌ని, జిల్లాల‌వారీగా జోన్ల‌వారీగా ఉద్యోగుల సంఖ్య‌ను నిర్ధారించి, ఖాళీల‌ను గుర్తించాల‌ని.. అలాగే ప్ర‌మోష‌న్ల ద్వారా ఏర్ప‌డే ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను మంత్రిమండ‌లి ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.